తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన బలగం చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బలగం చిత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వీక్షించారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన బలగం చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చినప్పటికీ.. కొన్ని థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. తాజాగా బలగం చిత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వీక్షించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి ధియేటర్‌లో ఆయన బలగం సినిమా చూశారు. బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తోపాటు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా బలగం సినిమాను వీక్షించారు. 

తెలంగాణ సంస్కృతి, గ్రామాల్లో అనుబంధాలను అద్భుతంగా చూపించారని ప్రశంసలు అందుకుంటున్న బలగం చిత్రాన్ని బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతు థియేటర్‌కు వెళ్లి చూడటం విశేషం. బండి సంజయ్ రాకతో దేవి థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

బలగం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. తెలంగాణ‌లో అనాదిగా ఆచరిస్తున్న.. పిట్ట ముట్టుడు కాన్సెప్ట్ తో కుటుంబాల మద్య ఉండే అనుబంధాల గురించి ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం పూర్తిగా పల్లె వాతావరణంలో తెరక్కించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. చిత్రంలోని ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక, బలగం చిత్రాన్ని తెలంగాణలోని పలు పల్లెల్లో అంతా కలిసి చూసేలా.. స్థానికంగా ప్రదర్శలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో చిత్రం సరికొత్త ట్రెండ్ చేసిందనే చెప్పాలి.