ఆటోడ్రైవర్ మర్డర్ మిస్టరీ.. భర్తకు ఉరేసి చంపి.. మటన్, మల్లెపూలు తెమ్మంటే.. ఎవరో హత్య చేశారంటూ డ్రామా..
జీడిమెట్లలో సంచలనం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసులో భార్య నిందితురాలని తేలింది. రెండో పెళ్లి చేసిన బాలికతో కలిసి అతడి గొంతుకు శాలువా బిగించి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ హత్య కేసులో కొత్త వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అతడిని హతమార్చిందని తేలింది. ఏడేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దాంపత్యం సాఫీగానే సాగింది. అయితే భార్య మాత్రం విలాసవంతమైన జీవితం కోసం అర్రులు చాచింది. మద్యం, కల్లు వ్యసనాలకు బానిస అయ్యింది. ఈ క్రమంలోనే భర్తకు ఓ 17యేళ్ల బాలికతో రహస్యంగా పెళ్లి కూడా చేసింది.
బాలికతో పెళ్లి చేసిన తర్వాత.. భర్త బాలికకు దగ్గరయ్యాడు. దీంతో భార్యను వదిలించుకోవాలని పథకాలు వేశాడు. ఇది తెలిసిన భార్య అదే బాలికతో కలిసి అతడిని దారుణంగా హత్య చేసింది. సోమవారం నాడు వెలుగుచూసిన జీడిమెట్లలోని సంజయ్ గాంధీ నగర్ లో ఆటో డ్రైవర్ హత్య కేసులో అసలు వాస్తవాలు ఇవి. హత్యకు గురైన ఆటో డ్రైవర్ పేరు సురేష్ (28). అతను రేణుకను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత ఆమె క్రమంగా చెడు వ్యసనాలకు బానిసయింది. నిత్యం కల్లు, మద్యం తాగుతూ పరాయి వ్యక్తులతో మాటలు కలుపుతూ తిరుగుతుండేది. అలా కొద్ది రోజుల క్రితం బహుదూర్ పల్లిలోని ఒక కల్లుదుకాణం దగ్గర దుండిగల్ తండాకు చెందిన అనాధ బాలికతో పరిచయమైంది. అలా వరుసగా 15 రోజులపాటు ఆమెని కలిసింది. ఆ తర్వాత ఆ బాలికను ఇంటికి తీసుకువచ్చి భర్త మెప్పు పొందేందుకు అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత బాలికతో దగ్గరైన సురేష్.. వ్యసనాల బారినపడి ఇబ్బందులపాలు చేస్తున్న భార్యను వదిలించుకోవాలని చూశాడని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు: ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు అరెస్ట్
ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సురేష్, రేణుక,రెండో పెళ్లి చేసుకున్న బాలిక ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత మధ్య మధ్యలో సురేష్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే రేణుక బాలికతో కలిసి అతని మెడకు శాలువాను బిగించి.. ఆటో ఒకరు ఇటు ఒకరు కలిసి గట్టిగా లాగారు. దీంతో సురేష్ ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సురేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని ఓ సంచిలో పెట్టారు. ఆ సంచిని రెండో అంతస్తు పైకి తీసుకువెళ్లి.. ఇంటి ముందున్న రోడ్డుమీదికి శవాన్ని వదిలేశారు. హత్య నుంచి తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లారు. సురేష్ ని చంపేసి శవాన్ని పడేసిన తర్వాత… అతను ఇంకా ఇంటికి రాలేదంటూ రేణుక అతని బంధువులకు ఫోన్ చేసింది. మటన్, మల్లెపూలు తీసుకురమ్మని అడిగితే బయటికి వెళ్లిన సురేష్ తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. ఆ తర్వాత రోజు ఎవరో తన భర్తను హత్య చేసి ఇంటి ముందే శవాన్ని వదిలేసి వెళ్లారని ఏడుస్తూ తెలిపింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే సురేష్ బంధువులు రేణుక మీద అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.