ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు: ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటు చేసకుంది. ఈ ఘటనలో గోరంట్ల అసోసియేట్స్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ఆయనను సీబీఐ అధికారులు కోర్టులో హజరుపర్చనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురికి గోరంట్ల అసోసియేట్స్ కు చెందిన బుచ్చిబాబు సీఏగా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతుంది. . గతంలో హైద్రాబాద్ లోని గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల సమయంలో కీలకమైన డాక్యుమెంట్లను సేకరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇటీవలనే రెండో చార్జీషీట్ దాఖలు చేశారు.ఈ చార్జీషీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును కూడా చేర్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బుచ్చిబాబు కొంతకాలం పాటు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు.
గత ఏడాది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుండి సీబీఐ అధికారులు సమాచారం సేకరించారు.160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద కవితకు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసు ఆధారంగా సుమారు ఏడు గంటలకు పైగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
గోరంట్ల అసోసియేట్స్ కు చెందిన బుచ్చిబాబును నిన్న సీబీఐ అధికారులు ప్రశ్నించారు. బుధవారం నాడు ఉదయం ఆయనను అరెస్ట్ చేసినట్టుగా సీబీఐ అధికారులు ప్రకటించారు. గతంలో కూడా బుచ్చిబాబును దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు బుచ్చిబాబును కోర్టులో హజరుపర్చనున్నారు. .ఇదిలా ఉంటే బుచ్చిబాబును తమ కస్టడీలోకి తీసుకోనేందుకు కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాదించారని సీబీఐ చెబుతుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తయారీలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ లిక్కర్ స్కాం పై విచారణకు వికే సక్సేనా విచారణకు ఆదేశించారు. దీంతో 2022 లో ఎక్సైజ్ పాలసీని ఆప్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని ఈడీ, సీబీఐఅు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిలపై దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. కవిత, శ్రీనివాసులు రెడ్డి పేరును రెండో చార్జీషీట్ లో చేర్చింది. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రశ్నించారు.