హైదరాబాద్: టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఒకదాని తర్వాత మరోటి వీడియోలు, ఆడియోలు లీకవుతున్నాయి. వాటి వల్ల కేసు ఎప్పటికప్పుడు మలుపులు తీసుకుంటుంది. శ్రావణి దేవరాజు తల్లి సత్యవతితో మాట్లాడిన సంభాషణల ఆడియో లీకైంది. 

దేవరాజు నుంచి కీలకమైన సమాచారం రాబట్టి హైదరాబాదు ఎస్సార్ నగర్ పోలీసులు ఆదివారం శ్రావణి కుటుంబ సభ్యులను, సాయిని విచారించారు. ఈ క్రమంలో దేవరాజు తల్లి సత్యవతికి కాల్ చేసి మాట్లాడిని ఓ ఆడియో లీకైంది. 

Also Read: సాయి కారులో హైదరాబాదు బయలుదేరిన శ్రావణి ఫ్యామిలీ

దేవరాజు అంటే తనకు ఇష్టమని, అతనితో వివాహం జరిపించాలని శ్రావణి సత్యవతితో చెప్పింది. అయితే, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసు స్టేషన్ లో దేవరాజుపై పెట్టిన కేసు గురించి సత్యవతి ప్రశ్నించింది. ముందు ఆ కేసులు వెనక్కి తీసుకోవాలని సత్యవతి శ్రావణికి సూచించింది.

పెళ్లికి సరేనంటే తాను కేసును వెనక్కి తీసుకుంటానని శ్రావణి సత్యవతికి చెప్పింది. పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలకమవుతుందని భావిస్తున్నారు. ఆదివారంనాడు సాయి, దేవరాజులను ఎదురెదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారంనాటి విచారణ కీలకం కానుంది. 

Also Read: శ్రావణితో నడిరోడ్డుపై సాయి గొడవ : సీసీటీవీ‌లో దృశ్యాలు.. పోలీసులకు కీలక ఆధారం

కేసు నుంచి తప్పించుకోవడానికి దేవరాజు మరోసారి శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. సాయి వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని దేవరాజు ఆరోపిస్తున్నాడు. సోమవారంనాడు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. దాంతో ఈ కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.