ఇదికదా జంతుప్రేమంటే..! తల్లిపిల్లిని బిడ్డల వద్దకు చేర్చేందుకు వందల కి.మీ ప్రయాణించి సాహసం
ఓ తల్లిపిల్లి ప్రాణాలు కాపాడేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించారు. జంతుప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన సూర్యాపేటలో వెలుగుచూసింది.

సూర్యాపేట : సాటి మనుషుల ప్రాణాలు పోతుంటేనే పట్టించుకోని ఈ కలికాలంలో ఓ పిల్లిని కాపాడేందుకు ఓ కుటుంబం తాపత్రయపడింది. రెండురోజులపాటు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు 150 కిలోమీటర్ల దూరంనుండి సహాయక సిబ్బందిని పిలిపించి బావిలో పడిపోయిన పిల్లి ప్రాణాలను కాపాడగలిగారు. ఇలా పిల్లిపిల్లల వద్దకు తల్లిని చేర్చి జంతుప్రేమను చాటుకుంది సూర్యాపేటకు చెందిన ఓ కుటుంబం.
వివరాల్లోకి వెళితే... సూర్యాపేట పట్టణంలోని ఓ ఇంటి సమీపంలో 40పీట్ల లోతైన బావి వుంది. ఇటీవల ఈ బావిచుట్టూ రెండు పిల్లిపిల్లలు తచ్చాడుతూ కనిపించడంతో ఆ ఇంట్లోని వారికి అనుమానం వచ్చింది. వెంటనే బావివద్దకు వెళ్లిచూడగా అందులో ఈ పిల్లిపిల్లల తల్లి పడివుంది.దీంతో వెంటనే ఆ పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా బావి లోతు ఎక్కువగా వుండటంతో సాధ్యపడలేదు.
ఈ క్రమంలో హైదరాబాద్ లోని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ ఇలా ప్రమాదంలో వున్న జంతువులను కాపాడుతుందని తెలుసుకున్నారు. జంతుప్రేమతో ఈ సొసైటీని ఏర్పాటుచేసిన ప్రదీప్ నాయర్ కు సూర్యాపేటవాసులు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన వెంటనే స్పందించారు. తన బృందంలోని సాజిద్ దాస్, రోమన్ దాస్, అరుణ్ దాస్ లను పిల్లిని కాపాడే బాధ్యతలు అప్పగించారు. వెంటనే వారు పిల్లి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు 150 కిలోమీటర్లు ప్రయాణించారు.
Read More హైదరాబాద్: టమాటాలు పంచిపెడుతూ కూతురు భర్త్ డే.. ఓ తండ్రి వినూత్న సెలబ్రేషన్స్
లోతు ఎక్కువగా వుండటంతో విషవాయువులు, గాలి అందకపోయే ప్రమాదం వుండటంతో ప్రత్యేక సాధనాలను ఉపయోగించి బావిలోకి దిగారు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు. పిల్లిని కాపాడి ఓ బోనులో వుంచి బావిలోంచి బయటకు తీసారు. తల్లిని చూసిన పిల్లిపిల్లలు గెంతులేస్తూ దగ్గరకువెళ్లడంతో ఇంతవరకు పడిన శ్రమనంతా మరిచిపోయారు.