Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ సిట్టింగ్ లపై అమిత్ షా నజర్ ?

  • టిఆర్ఎస్ సిట్టింగ్ లకు సీట్లు ఇస్తామని కేసిఆర్ ప్రకటన
  • సిట్టింగ్ సభ్యులు జారీ పోకుండా కేసిఆర్ స్కెచ్
  • గ్రాఫ్ పడిపోయిన వారికి సీట్లిస్తరా అని పార్టీలో చర్చ
  • సిట్టింగ్ లతో టచ్ లో ఉన్న అమిత్ షా
amith shah touch with trs sitting mlas and mps

తెలంగాణ శాసనసభాపక్షం సమావేశంలో సిఎం కిసిఆర్ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ 105 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే 90 మంది ఉన్నాం. ప్రతిపక్షాలపై జనాలకు నమ్మకం లేదు. కాబట్టి 2019లో మన గెలుపు ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు కేసిఆర్.

అయితే సిట్టింగ్ సభ్యులందరికీ సీట్లు ఇస్తామని కేసిఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఎందుకు చేశారబ్బా అన్న చర్చ ఇటు టిఆర్ఎస్ లో, అటు మిగతా పక్షాల్లో జోరుగా సాగుతోంది. సిట్టింగ్ లలో కొందరి పనితీరు దారుణంగా ఉందని కేసిఆర్ చేయించిన సర్వేల్లో తేలింది. దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న సర్వే నివేదికలు సిఎం వద్ద ఉన్నాయి. మరి అలాంటప్పుడు సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ప్రకటించడం వెనుక అసలు మతలబేంటని జనాలు చర్చించుకుంటున్నారు.

అయితే ఇటీవల కాలంలో బిజెపి నేత అమిత్ షా చాప కింద నీరులా గులాబీ తోటకు కన్నం వేసే ప్రయత్నం చేస్తున్నట్లు టిఆర్ఎస్ అధినేత అంచనాల్లో ఉన్నారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నట్లు బిజెపి నేతల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆరుగురు ఎంపీలు సైతం కమలం తోటలోకి దూకేందుకు సై అంటున్నట్లు పుకార్లు వస్తున్నాయి. దీంతో ఒక దశలో సిఎం కేసిఆర్ అమిత్ షా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షా పప్పులుడకవు అన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు బిజెపితో టచ్ లో ఉన్నట్లు టిఆర్ఎస్ లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారినా జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనలో టిఆర్ఎస్ ఉంది. అందుకోసమే సిట్టింగ్ లు ఆందోళన చెందకుండా వారందికీ సీట్లు రిజర్వు అయిపోయాయని, నిశ్చితంగా ఉండాలంటూ సిఎం వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

మరి అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ లపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేటతెల్లం అయింది. వారందరినీ వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా శనివారం జరిగిన ఎల్పీ సమావేశంలో సిట్టింగ్ అందరికీ సీట్లు, గెలిపించే పూచీ నాది అని సిఎం ప్రకటించడం చూస్తే సిట్టింగ్ లపై కమలనాథుల కన్ను పడిందన్న ఆందోళనకు బలం చేకూరినట్లు అయిందంటున్నారు.

మరి గెలవరు అని పలు సర్వేల్లో తేలిన తర్వాత కూడా వారిక సీట్లెలా ఇస్తారన్న ప్రశ్న టిఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. అయితే సిట్టింగ్ లు అందరూ పక్క చూపులు చూడకుండా వారిని ఇలాగే ఉంచి చివరకు ఎన్నికల నాటికి గెలిచే వారెవరు? గ్రాఫ్ బాగాలేక ఓడిపోయే వారెవరో తేల్చుకుని అవసరమైతే అప్పుడు పక్కన పెట్టాలన్న ఆలోచన కూడా ఉండొచ్చని చెబుతున్నారు కొందరు టిఆర్ఎస్ నేతలు.

సిట్టింగ్ లు జారీ పోకుండా సిఎం ప్రకటన చేసినప్పటికీ సీటు రాదన్న సంకేతాలున్న కొందరు నేతలు మాత్రం సిఎం మాటలను విశ్వసించే పరిస్థితి లేదని చెబుతన్నారు. తీరా ఎన్నికల సమయంలో సీటు లేదంటే ఎటు పోతామన్న ఆందోళనలో వారు ఉన్నారు. మొత్తానికి బిజెపి అధ్యక్షులు అమిత్ షా తదుపరి పర్యటన నాటికి టిఆర్ఎస్ సిట్టింగ్ ల విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios