Ambedkar Statue: భారత దేశానికి తలమానికంగా నిలిచే చారిత్రక ఘట్టం ఆవిష్కరణ తెలంగాణలో నేడు జరుగనున్నది. దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా జరుగనున్నది. అంబేద్కర్ భారీ విగ్రహం తోపాటు స్మారక భవన నిర్మాణం, చుట్టూ ప్రత్యేకమైన పార్క్, ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు.ఓ సారి ఆ మహా విగ్రహ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
Ambedkar Statue: తెలంగాణాలో నేడు ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. మన రాష్ట్ర సిగలో మరో మణిహారం చేరనున్నది. హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే ఎత్తయిన అంబేద్కరుడి విగ్రహ ఆవిష్కరణకు సిద్ధమైంది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ చారిత్రక నిర్మాణ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా జరుగనున్నది. అంబరాంటే అంబేద్కరుడి సంబురం కోసం తెలంగాణ సమాజమే కాదు.. యావత్తు భారతం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నది. ఈ ఉద్విగ్న భరిత ఘట్టంతో యావత్ దేశం పులికించిపోనున్నది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రధాన ఘట్టాలు
>> 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో పాటు స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 146.50 కోట్ల అంచనాతో రూపొందించిన ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
>> తొలుత విగ్రహ నమూనా కోసం.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, పసుమారి దయాకర్, ఆరూరి రమేశ్ తో ఓ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీ 2017 ఫిబ్రవరిలో చైనాలో పర్యటించి.. పలు విగ్రహా పరిశీలన, నైపుణ్య ఇంజనీర్లతో భేటీ అయ్యింది.
>> ఫైనల్ గా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 50 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటుతో పాటు మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘటనలను ఆవిష్కృతం చేసేలా ఫొటో గ్యాలరీ సహా 2.93 ఎకరాల్లో పార్కు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
>> ఈ క్రమంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో 2021 జూన్ 3న నిర్మాణ ఒప్పందం కుదిరింది. ఈ నిర్మాణ బాధ్యతలను నోయిడా డిజైన్ అసోసియేట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది.
>> మహారాష్ట్రకు చెందిన పద్మ భూషణ్ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ లు విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. వీరు రూపొందించిన నిలువెత్తు విగ్రహ నమూనాను కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించింది.
>> అన్ని అనుకున్న విధంగానే వేగంగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.అయితే.. అనుకోని విపత్తులా కరోనా మహమ్మారి విరుచుకపడటంతో ఈ మహా యజ్ఞం తాత్కాలికంగా నిలిచిపోయింది. కరోనా ప్రభావం తగ్గగానే నిర్మాణ పనుల్లో మళ్లీ వేగం పుంజుకున్నది.
>> 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహంతో పాటు ఆ విగ్రహం కింద పార్లమెంట్ తరహాలో మూడంతస్తుల్లో స్మారక భవనాన్ని నిర్మించారు. దీనిని 2, 476 చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు.
>> ఈ బేస్ మెంట్ నిర్మాణం కోసం .. ఆగ్రా, నోయిడా. జైపూర్ తదితర ప్రాంతాల నుంచి ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను తెప్పించారు.
>> ఈ స్మారక భవనంలో అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మహానీయుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలను తెలుసుకునే విధంగా ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు.
>> 2023 ఏప్రిల్ 30కి గడువు నిర్దేశించుకోగా అంతకన్నా ముందే పనులన్నీ పూర్తయ్యి... ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి విగ్రహావిష్కరణ జరుగనున్నది.
>> విగ్రహం చెక్కుచెదరకుండా .. నీటి కాలుష్యంతో పాటు గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దశాబ్దాల పాటు విగ్రహం మెరుస్తూ ఉండేలా పాలీ యూరేథీన్ కోటింగ్ వేశారు.
>> న భూతో న భవిష్యతి అన్న చందంగా.. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మహా విగ్రహా ప్రారంభోత్సవ వేళ .. రాజ్యాంగ నిర్మాతకు Asianet news telugu ప్రత్యేక వందనాలు.
విగ్రహ ప్రత్యేకతలు..
విగ్రహ ఎత్తు: 125 అడుగులు
వెడల్పు: 45 అడుగులు
బేస్ మెంట్ ఎత్తు : 50 అడుగులు
ప్రాజెక్టు విస్తీర్ణం: 11. 4 ఎకరాలు
వాడిన స్టీల్: 155 టన్నులు
వాడిన కంచు: 111 టన్నులు
ఔటర్ లేయర్ కు వాడిన కంచు : 9 టన్నులు
మొత్తం వ్యయం : రూ. 146 కోట్లు
నిర్మాణ సంస్థ : కేపీసీ ప్రాజెక్టు ప్రై.లి.
డిజైనర్: పద్మ భూషణ్ రాం వంజి సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్
