బిఆర్ఎస్ కు బిగ్ షాక్... బిజెపిలోకి మాజీ మంత్రి తనయుడు... మహూర్తం ఖరారు..
బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ బిజెపిలో చేరడానికి సిద్దమైనట్లు... అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

ములుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో వున్నాయి. దీంతో బిఆర్ఎస్ లో సీటు ఆశించి భంగపడ్డ అసంతృప్త నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు నాయకులు బిఆర్ఎస్ కు రాజీనామా చేయగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కూడా అదేబాటలో నడుస్తున్నారు. బిఆర్ఎస్ ను వీడిన ప్రహ్లాద్ బిజెపిలో చేరడానికి సిద్దమైనట్లు... ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
బిఆర్ఎస్ పార్టీ ముగులు ఎమ్మెల్యే టికెట్ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతికి కేటాయించారు. దీంతో ఈ టికెట్ ఆశించిన మాజీ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దీంతో ఆయన బిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరడానికి సిద్దమయ్యారు. ఈనెల 12న భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ప్రహ్లాద్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
తన బలాన్ని ప్రదర్శించేలా 20వేల మందితో బహిరంగ సభ నిర్వహణకు ప్రహ్లాద్ సిద్దమయ్యారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎస్టీ నియోజకవర్గాల ఇంచార్జీ గరికపాటి మోహన్ రావు కూడా ఈ సభలో పాల్గొననున్నారు. ములుగు టికెట్ పై హమీ దక్కడంతో ప్రహ్లాద్ బిజెపిలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
Read More అనుచరులతో భేటీ:బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న ఆరేపల్లి మోహన్
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో బిఆర్ఎస్ నుండి పోటీచేసిన చందూలాల్ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుండి బిఆర్ఎస్ లో మాజీ మంత్రికి పూర్తిగా ప్రాధాన్యత తగ్గింది. దీంతో అసంతృప్తిగా వున్న చందూలాల్ ఈసారి కొడుకు ప్రహ్లాద్ కు టికెట్ ఇప్పించుకోడానికి ప్రయత్నించాడు. కానీ బిఆర్ఎస్ నాయకత్వం మాత్రం నాగజ్యోతికి టికెట్ కేటాయించింది. దీంతో ప్రహ్లాద్ బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లారు. ములుగు ఎమ్మెల్యే టికెట్ హామీ రావడంతో ఆ పార్టీలో చేరేందుకు ఆయన సిద్దమయ్యారు.
ఇదిలావుంటే ఇప్పటికే ములుగు టికెట్ కోసం ఆ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు జవహర్ లాల్, మహిళా మోర్చ నాయకురాలు కృష్ణవేణి నాయక్, గిరిజన మోర్చా నాయకులు తాటి కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ కూడా ములుగు టికెట్ ఆశించి బిజెపిలో చేరుతున్నారు. వీరిలో ఎవరికి ములుగు టికెట్ దక్కుతుందో చూడాలి.