అనుచరులతో భేటీ:బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న ఆరేపల్లి మోహన్
ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ ను వీడనున్నారు. ఇవాళ అనుచరులతో ఆయన సమావేశమయ్యారు.
కరీంనగర్: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ ను వీడనున్నారు. బుధవారంనాడు ఆరేపల్లి మోహన్ తన అనుచరులతో సమావేశమయ్యారు. రేపు బీఆర్ఎస్ కు ఆరేపల్లి మోహన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆరేపల్లి మోహన్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. కానీ, 2019 మార్చి 17న ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముందు మోహన్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కూడ ఆరేపల్లి మోహన్ కు నామినేట్ పదవులు దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి లేదా నామినేట్ పదవి వస్తుందని మోహన్ భావించారు. కానీ మోహన్ కు బీఆర్ఎస్ నాయకత్వం నుండి ఎలాంటి హామీ దక్కలేదు. దీంతో మోహన్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
మానకొండూరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కవ్వంపల్లి సత్యనారాయణ దిగే అవకాశం ఉంది. అయితే ఆరేపల్లి మోహన్ తో బీజేపీ నాయకులు ఇప్పటికే రెండు దఫాలు చర్చించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే మోహన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందనే ప్రచారం సాగుతుంది. అయితే ఆరేపల్లి మోహన్ ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది.