తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేస్తానంటున్నారు అజయ్ దేవగణ్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
న్యూడిల్లీ : దేశ రాజధాని డిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కలిసారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఉన్నారు. ఒకరు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సిద్దమవగా మరొకరు సర్కార్ కు తనవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.
తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధిపై కపిల్ దేవ్ ప్రశంస...
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి సీఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్ కు వివరించారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని కపిల్ దేవ్ సీఎంకు తెలిపారు. అలాగే రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని కపిల్ దేవ్ ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఈ సందర్భంగా దక్షిణ కొరియాలో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు, అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
తెలంగాణలో అజయ్ దేవగణ్ పెట్టుబడులు..
ఇక తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందకువచ్చారు ప్రముఖ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్. ఇందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలను కల్పిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో చేపడతానని అజయ్ దేవగణ్ తెలిపారు. అలాగే సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు.