రాసిపెట్టుకొండి... నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని : కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం ఇటు కేటీఆర్, అటు కవిత ప్రయత్నిస్తున్నారు. మరి ఎవరికి ఆయన వారసత్వం దక్కుతుంది? భవిష్యత్ లో తెలంంగాణ సీఎం కాబోయేది ఎవరు?
- FB
- TW
- Linkdin
Follow Us
)
కేసీఆర్ కు తప్పని వారసత్వ పోరు
Kalvakuntla Kavitha : రాజకీయాల్లో వారసత్వ పోరు సర్వసాధారణం... ఇదే ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. కొడుకు కేటీఆర్ కు పూర్తిగా బాధ్యతలు అప్పగించి రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్న ఆయనకు కూతురు కల్వకుంట్ల కవిత షాక్ ఇచ్చింది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారామె... ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉంటున్న ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి ద్వారా రాజకీయాలు చేస్తున్నారు.
మొత్తంగా కేసీఆర్ కుటుంబంలో పొలిటికల్ ఫైట్ జరుగుతోందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. తన సొంత అన్న కేటీఆర్ తో విబేధాలు లేవంటూనే కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరినీ నాయకుడిగా తాను అంగీకరించనని కవిత అంటున్నారు. అంటే అన్న అన్నే... రాజకీయాలు రాజకీయాలే అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నట్లున్నానని కవిత చెప్పకనే చెబుతున్నారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన చెల్లి దాదాపు పార్టీలో లేనట్లే వ్యవహరిస్తున్నారు... కవిత వ్యవహారంపై ఎక్కడా స్పందించడం లేదు. ఇద్దరు బిడ్డల పొలిటికల్ ఫైట్ లో కేసీఆర్ నలిగిపోతున్నట్లు కనిపిస్తోంది.
కేసీఆర్ దూరమైతేనే కవితకు లాభమా?
ఇప్పటికే బిఆర్ఎస్ వ్యవహారతీరుపై తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బయటకురావడంపై కవిత సీరియస్ గా ఉన్నారు. ఇది కేసీఆర్ చుట్టూ ఉన్నవారి పనే అంటూ... వాళ్లు ఎవరో బయటపెడతానని హెచ్చరిస్తున్నారు. తండ్రిని దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంతో కేసీఆర్ కుటుంబంలో గుట్టుగా సాగుతున్న వారసత్వ పోరు రట్టయ్యింది. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుండి కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నా ఎక్కడ బైటపడలేదు... కానీ తన లెటర్ లీక్ అయ్యాక ఆమె పూర్తిగా ఓపెన్ అయ్యారు. తమ కుటుంబసభ్యులపైనే ఆమె తిరుగుబాటు చేశారు.
ఎప్పటినుండో తండ్రి కేసీఆర్ నీడలోంచి బయటకువచ్చి సొంతంగా ఎదగాలని కవిత ప్రయత్నిస్తున్నారు. ఆమెకు తెలుసు... తండ్రి ఎప్పటికైనా కొడుకు కేటీఆర్ నే వారసుడిగా ప్రకటిస్తారని. ఆమె అనుకున్నట్లే జరిగింది... ఇప్పటికే పార్టీ పగ్గాలను అప్పగించిన కేసీఆర్ 2023 ఎన్నికల్లో గెలిచివుంటే కేటీఆర్ ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేవారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సీటుపై కవితకు కూడా కన్ను ఉంది... అందుకే ఆమె సోదరుడి నాయకత్వాన్ని అంగీకరించడంలేదు... ఇందుకోసం తండ్రి నుండి మెల్లిగా దూరం జరుగుతున్నారు. ఈ లెటర్ లీక్ ఆమెకు మంచి అవకాశం వచ్చింది... తనపై ఆ పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకుని దూరమవుతూ ప్రజల సానుభూతిని కూడా పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండుపిట్టలు సామెతను గుర్తుచేస్తున్నాయి కవిత పొలిటికల్ స్ట్రాటజీస్.
సీఎం సీటుపై కన్నేసిన కవిత
తెలంగాణలో మహిళా ముఖ్యమంత్రిగా ఎవరికైనా ఛాయిస్ ఉందంటే అది కవితకే. తండ్రి కేసీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని బలంగా ప్రయత్నిస్తే ఆమెకు అవకాశాలు ఉన్నాయి. ఇది కష్టమే అయినా అసాధ్యం కాదు. ఈ విషయం కవితకు కూడా తెలుసు. అందుకే ఆమె సొంత రాజకీయాలకు సిద్దమయ్యారు... తాను బిఆర్ఎస్ సభ్యురాలిని కాదు తెలంగాణ జాగృతి సభ్యురాలిని మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవసరమైతే తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన కూడా ఆమెకు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది.
సీఎం సీటుపై కవిత కన్నేసారు కాబట్టే తన సొంత అన్న కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడంలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తన పోటీ అన్నతోనే అని... సీఎం రేసులో అతడు తనకంటే ముందున్నాడని. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పటికే కేటీఆర్ పార్టీని హస్తగతం చేసుకున్నాడు... ఇలాగైతే తన సీఎం డ్రీమ్ సాధించడం కష్టం అవుతుందని భావించారో ఏమో కవిత ఆ పార్టీకి దూరం జరిగారు. కేసీఆర్ ను తప్ప ఎవరిని నాయకుడిగా అంగీకరించనంటూ కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు.
టార్గెట్ సీఎం సీటే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కవిత మరింత ఓపెన్ అయ్యారు... తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇప్పట్లో కాకపోయినా ఓ పదేళ్లకో, పదిహేనేళ్లకో సీఎం అవుతానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఎవరైనా తమ రంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకుంటారు... అందుకోసమే ప్రయత్నిస్తుంటారు. కవిత కూడా రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకుంటున్నట్లు తెలిపారు... అందుకే సీఎం పదవిని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
కవిత మాటలను బట్టి ఓ విషయం అర్థమవుతోంది... ఆమె పోటీ కేటీఆర్ తోనే అని. మరి బిఆర్ఎస్ లో ఉంటూనే తన లక్ష్యం వైపు అడుగులు వేస్తారా? లేక ఇప్పట్లాగే జాగృతి ద్వారా ముందుకు వెళతారా? అన్నది భవిష్యత్ తేల్చనుంది. ఏదేమైనా కవిత మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు... అన్నతో అమీతుమీకి సిద్దమయ్యారు.
కేసీఆర్ తోనూ కవితకు చెడిందా?
కవితకు తండ్రి కేసీఆర్ తోనూ చెడిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఇటీవల కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే... ఈ సమయంలో తండ్రిని కలిసేందుకు భర్తతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు కవిత. ఈ క్రమంలోనే ఆమెతో కేసీఆర్ సరిగ్గా మాట్లాడలేదని... సమయం లేదంటూ దాటవేసేందుకు ప్రయత్నించారని ప్రచారం జరిగింది. విచారణ తర్వాత కూడా కేసీఆర్ ను చాలామంది నాయకులు కలిసారు... కానీ కవిత మాత్రం కలవలేదు. దీంతో తండ్రికూతురు మధ్యకూడా దూరం పెరిగినట్లు పొలిటికల్ సర్కిల్ లో ఓ ప్రచారం జోరందుకుంది.
ఇక కవిత కూడా కొన్ని సందర్భాల్లో తండ్రిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. లెటర్ లీక్ వ్యవహారంలో.... ప్రతిసారి తాను రాసే లెటర్ ను తండ్రి చదివి చించేవారని... ఇప్పుడు మాత్రం అలా ఎందుకు చేయలేదో అంటూ కవిత అనుమానం వ్యక్తం చేస్తారు. అంటే ఈ లెటర్ లీక్ వెనక తండ్రి ప్రమేయం కూడా ఏమైనా ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా తాను నిజామాబాద్ ఎంపీగా ఉండగా కేసీఆర్ ను స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ అడిగానని... కానీ ఆయన ఇవ్వలేదన్నారు. ఎందుకు ఇవ్వలేదో ఇప్పటికీ అర్థంకాలేదని కవిత అన్నారు.
ఇలా తండ్రి కేసీఆర్ తన పొలిటికల్ గ్రాప్ తగ్గడానికి కారణం అనేలా కవిత కామెంట్స్ చేశారు. దీనిద్వారా తన తండ్రికి, బిఆర్ఎస్ పార్టీకి దూరంకాక తప్పడలేదని ప్రజలకు చెప్పాలన్నదే కవిత ఆలోచన అయివుంటుంది. ఇలా పార్టీకి, కుటుంబానికి దూరమవుతూ సొంత రాజకీయాలు చేస్తున్న కవిత రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.