బీఆర్ఎస్‌తో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అగ్ర నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. రాష్ట్రంలో తమ ప్రయాణం బీఆర్ఎస్‌తోనే అని అసెంబ్లీ సాక్షిగా  ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎంఐఎం అగ్ర నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌తో పొత్తుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు . రాష్ట్రంలో తమ ప్రయాణం బీఆర్ఎస్‌తోనే అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా వుండటం గర్వంగా వుందని.. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మిగిలిన రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. సీఏఏ, యూసీసీలకు వ్యతిరేకంగా ప్రకటించినందుకు కేసీఆర్‌కు అక్బరుద్దీన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేవని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ఇలా ఏ పథకం తీసుకున్నా మంచి ఫలాలను ఇస్తోందని ఒవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఆయన వెల్లడించారు. 

కాగా.. గత నెలలో అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని అన్నారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. చావు బతుకుల మధ్య వున్న తనను బతికించిన ఎమ్మెల్యే బలాలకు జీవితాంతం రుణపడి వుంటానని ఆయన తెలిపారు. 

ALso Read: నన్ను చంపాలనుకున్న వారిని క్షమిస్తున్నా.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఇకపోతే.. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న అక్బరుద్దీన్ ఒవైపీపై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడితో ఆగని దుండగులు ఆపై కత్తులు, డాగర్లతో అక్బరుద్దీన్‌పైనా.. ఆయన అనుచరులపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడి చావు అంచులదాకా వెళ్లొచ్చారు. అయితే అక్బరుద్దీన్ గన్‌మెన్ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు. అక్బరుద్దీన్‌పై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కారణంగానే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిందని టాక్.