Asianet News TeluguAsianet News Telugu

పబ్‌లో వన్యప్రాణులతో ‘‘వైల్డ్ వీకెండ్’’.. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సీరియస్.. ఏడుగురిపై కేసు..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జోరా పబ్ వింత పోకడలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

7 booked after exotic animals viral video in Jubilee Hills xora pub ksm
Author
First Published May 31, 2023, 12:52 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జోరా పబ్ వింత పోకడలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు. జోరా బార్ అండ్ కిచెన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ‘‘వైల్డ్ వీకెండ్’’ ఆలోచనను తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మే 28న పబ్‌లో వన్య ప్రాణులను ప్రదర్శించారు. అందులో అన్యదేశ కొండచిలువలు, ఇగువానా ఉన్నాయి.  పబ్​లోకి వచ్చిన యువతీయువకులు ఆ వన్య ప్రాణులతో డ్యాన్స్ చేస్తూ ఫొటోలు దిగారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వన్యప్రాణి ప్రేమికుడైన ఆశిష్ చౌదరి అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

‘‘జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో ఉన్న ప్రముఖ నైట్ క్లబ్ జోరాలో అన్యదేశ జంతువులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వారి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పోస్టు చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఆశిష్ చౌదరి  కోరారు. దీంతో పబ్ నిర్వహకులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అశిష్ ట్వీట్‌పై స్పందించిన  స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. ఇటువంటి చర్యలు సిగ్గు చేటు, షాకింగ్ గురిచేశాయని పేర్కొన్నారు. డీజీపీ, హైదరాబాద్‌ సీపీ దృష్టికి తీసుకెళ్తాను అంటూ అరవింద్ కుమార్ ట్విట్ చేశారు. 

ఈ క్రమంలోనే వన్యప్రాణి ఔత్సాహికుడు ఆశిష్ చౌదరి ట్విట్టర్ ఫిర్యాదు ఆధారంగా.. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అటవీ అధికారులతో కలిసి మంగళవారం సైదాబాద్‌లోని హైదరాబాద్‌ ఎక్సోటిక్‌ పెట్స్‌ స్టోర్‌పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. పెట్స్ స్టోర్‌పై దాడి చేసి.. వివిధ అన్యదేశ జంతువులు, పక్షులు, సరీసృపాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉన్న జంతువులనే పబ్‌లో ప్రదర్శించినట్టుగా గుర్తించారు. ఇక, ఏడుగురు నిందితుల్లో జోరా పబ్ యజమాని వినయ్ రెడ్డి, అతని మేనేజర్లు, పెట్ స్టోర్ యజమాని యాసర్, ముగ్గురు పెట్ డీలర్లు ఉన్నారు. పబ్ యజమాని వినయ్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ చేశారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్ 4 ప్రకారం వీటిలో చాలా జంతువులు సంరక్షించబడుతున్నాయని.. వాటిని ప్రదర్శనలో ఉంచడం లేదా సరదాగా నిర్వహించడం సాధ్యం కాదని అటవీ అధికారులు తెలిపారు.

 

అయితే తాము ఏ తప్పు చేయలేదని జోరా పబ్ వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రదర్శనలో కనిపించే జంతువులన్నీ చట్టబద్ధంగా పొందబడ్డాయని పేర్కొన్నాయి. వాటికి అవసరమైన లైసెన్సులు, అనుమతులు ఉన్నాయని తెలిపాయి. ఈవెంట్‌ల సమయంలో జంతువులకు ఎటువంటి హాని జరగలేదని చెప్పాయి.  జంతువులను చాలా జాగ్రత్తగా , శ్రద్ధతో నిర్వహించామని, అవసరమైన అన్ని భద్రతా చర్యలను పాటిస్తున్నామని పేర్కొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios