దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ: రూ. 12 వేల కోట్లకు వచ్చింది రూ. 3100 కోట్లేనన్న కేసీఆర్

2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు డివి ప్రసాద్ బుధవారం నాడు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిపాయని చెప్పారు. 

 దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు స్పష్టం చేశారు. ఈ సారి ఎఫ్.సి.ఐ. 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సమకూర్చిందని అభినందించారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండిందన్నారు. ఇది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్.సి.ఐ. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

కరోనా – లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

మొత్తం 6,386 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 55.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఎఫ్.సి.ఐ సిఎండి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారన్నారు.


గతంలో సాగునీటి సౌకర్యం లేక, కరెంటు సరిగా లేక తెలంగాణలో పంటలు సరిగా పండకపోయేది. దీంతో ధాన్యం, ఇతర పంటల దిగుబడి తక్కువ వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 

. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి, సాగునీరు అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగిందని ఆయన చెప్పారు.

 రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో అటు ప్రాజెక్టు కాల్వల ద్వారా, ఇటు చెరువుల ద్వారా, మరోవైపు బోర్ల ద్వారా పుష్కలమైన నీరు వాడుకోవడం సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 39.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగిందన్నారు. దీని ఫలితంగా తెలంగాణలో వరి ధాన్యం రికార్డు స్థాయిలో పండింది. పండిన పంట రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు, దేశ అవసరాలను కూడా తీరుస్తుందన్నారు.