తెలంగాణలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతూ ప్రభుత్వాన్ని కంగారు పెడుతోంది. తాజాగా ఆదివారం కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,082కి పెరిగింది.

కాగా ఆదివారం 46 మంది డిశ్చార్జ్ అవ్వడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 545కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 29 మంది కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 508 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Also Read:వనస్థలిపురంలో కరోనా ఉధృతి, 8 కంటైన్మెంట్ జోన్లు: వారం పాటు రాకపోకలు బంద్

హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలో ఎనిమిది  కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు.

వనస్థలిపురంలోని మూడు కుటుంబాల్లో 9 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిని ఆసుపత్రికి తరలించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్, సాహెబ్ నగర్ రోడ్డు, ఏబీ టైప్ కాలనీలు, ఎస్ కే డీ నగర్, ఫేజ్ 1 కాలనీ, సచివాలయనగర్ లను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతంలోని 169 మందిని క్వారంటైన్ కు తరలించారు.

Also Read:స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ: తెలంగాణ డీజీపీ

కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో సోమవారం నుండి వారం రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా నిబంధనలను అమలు చేయనున్నారు.

రైతు బజార్, పండ్లు, ఇతర మార్కెట్లను పూర్తిగా మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందుజాగ్రత్తగా కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.