కదులుతున్న రైలు నుంచి పడి.. హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి..
కదులుతున్న రైలులో టాయిలెట్ కోసం వెడుతూ.. తలుపులోంచి కిందపడి ఓ 14యేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
తిరుపతి : కదులుతున్న ట్రైన్ లోనుంచి ప్రమాదవశాత్తు కిందపడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రైలు కదులుతుండగా టాయిలెట్‌కు వెళ్లిన బాలుడు.. కదులుతున్న రైలు డోర్‌లో నుంచి కింద పడ్డాడు. మృతుడు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఇ.రాహుల్‌రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటన బుధవారం పాకాల రైల్వేస్టేషన్ సమీపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది.
ఈ ఘటన జరిగినప్పుడు బాలుడు తన అమ్మమ్మతో కలిసి తన తల్లి స్వగ్రామం గుడిపాల మండలం పల్లంపల్లికి వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను జీఆర్పీ (ప్రభుత్వ రైల్వే పోలీస్) ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టాయ్ లెట్ కి వెళ్లాలని ఆ బాలుడు తన అమ్మమ్మకు చెప్పాడు. ఆమె వెళ్లమని చెప్పడంతో.. సీట్లోంచి లేచి.. టాయిలెట్ల వైపు వెళ్లాడు. అయితే, ట్రైన్ కదులుతుండడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. టాయిలెట్ల వరకు చేరుకునే సమయానికి పక్కన ఉన్న రైలు ఎగ్జిట్ డోర్ నుండి కింద పడిపోయాడు.
రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే.. గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతల పిలుపు.. టెన్షన్.. టెన్షన్..
అది గమనించిన తోటి ప్రయాణికులు రాహుల్ అమ్మమ్మకు సమాచారం అందించారు. వెంటనే ఆమె, మిగతావారు కలిసి రైల్వే రక్షణ దళానికి సమాచారం అందించారు. రైలును ఆపిన సిబ్బంది.. పాకాల స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అతని మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.