బీజేపీ బలవంతంతోనే జనసేన పొత్తు? పవన్ ఎందుకు ప్రచారం చేయడం లేదు?
జనసేన రాజకీయం అంతుచిక్కని విధంగా సాగుతున్నది. ఏపీలో ఒక పొత్తు, తెలంగాణలో మరో పొత్తు పొంతన లేకుండా సాగుతున్నది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ ఇప్పుడు జనసేనకు రుచించడం లేదా? లేక తప్పక చేయాల్సి వస్తున్నదా? అనే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉన్నది. ఇప్పటి వరకు జనసేన అభ్యర్థులకు ఆయన ప్రచారం చేసింది లేదు. ఇక పై చేస్తారా? అనేదీ డౌటుగానే ఉన్నది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న జనసేన.. బీజేపీతో పొత్తుతో పోటీలో ఉన్నది. ఎన్డీయే కూటమిలోనే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తున్న రీతిలోనే ఎన్నికల బరిలో దిగడం గురించి మాట్లాడారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్‌లు పవన్ కళ్యాణ్‌ను కలిసి పొత్తు గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత కూడా వెంటనే పవన్ కళ్యాణ్ సీట్ల గురించి మాట్లాడలేదు. జనసేన 8 స్థానాల్లో మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నది.
తెలంగాణలో బీజేపీ పొత్తు తర్వాత జనసేన గురించి పలువిధాల చర్చ జరుగుతున్నది. ఎన్డీయేలో ఉన్న జనసేన.. ఎన్డీయే కూటమి వెలుపలి పార్టీ టీడీపీతో అనూహ్యంగా పొత్తు పెట్టుకుంది. టీడీపీతోనూ పొత్తు పెట్టుకోవడానికి బీజేపీని కన్విన్స్ చేస్తానని పవన్ చెబుతూ వచ్చారు. కానీ, చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించారు. దీంతో బీజేపీ పరిస్థితి ఏమిటీ? అనే చర్చ ఉన్నది.
Also Read: కేసీఆర్‌పై అత్యధిక నామినేషన్లు.. అసలైన సవాల్ ఏమిటీ? ఒక్క ఈవీఎం ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగించవచ్చు?
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన.. బీజేపీని దాటిపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఏమున్నా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించినంత హుషారుగా ఇప్పుడు ప్రచారం మాత్రం జరగడం లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా క్యాంపెయిన్ చేసింది లేదు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీతోపాటు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ ప్రసంగంలోనూ పవన్ కళ్యాణ్ కేవలం మోడీని పొగడటం మేరకు సరిపెట్టుకున్నారు. అధికార బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పై విమర్శలు చేయలేదు. ఆ సభలో పవన్ ప్రసంగం ఏపీలో కాకుండా.. చప్పగా ఉన్నదనే టాక్ వచ్చింది.
బీజేపీ వ్యూహంలో భాగంగా జనసేన పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందా? అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారా? అనే అనుమానాలు ఈ నేపథ్యంలో బయల్దేరాయి. పొత్తులో ఉన్నప్పటికీ జనసేన అభ్యర్థులకు ప్రచారంలో బీజేపీ నుంచి పెద్దగా సహాయ సహకారాలు అందడం లేదు. పెద్దగా అనుభవం లేని జనసేన అభ్యర్థులూ ప్రచారాన్ని దీటుగా నిర్వహించడంలో విజయవంతం కావడం లేదనే చర్చ జరుగుతున్నది.
Also Read గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు?.. ఎంఐఎం నేత తీవ్ర ఆరోపణలు
తెలంగాణలో జనసేనకు పెద్దగా పట్టులేదు. పవన్ సభలకు మంది వస్తారేమో కానీ, అభిమానుల ఓట్లు పడతాయా? అనేది సందేహాస్పదమే. అలాంటిది.. జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్వల్పంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ కావడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ స్వయంగా మూడు నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా ఒక్క అభ్యర్థి గెలువకపోతే వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మైనస్‌గా మారుతుందని, ఒక్క అభ్యర్థినీ గెలిపించే సత్తా పవన్ కళ్యాణ్‌కు లేదనే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకోవాల్సి ఉంటుందనే విశ్లేషణలు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రైమ్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్. అందుకే ఇక్కడ ఆయన రాజకీయంగా సెన్సేషనల్ కామెంట్స్ చేయలేదు. ఇక్కడ అధికార బీఆర్ఎస్‌ను విమర్శిస్తే.. ఏపీ నేతలు అనే విమర్శలతో మరింత డ్యామేజీ అయ్యే ముప్పే ఎక్కువ. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థులకు, సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారా? అనేది ఇంకా తేలలేదు. జనసేన అభ్యర్థులు మాత్రం పవన్ ప్రచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.