మంచి ఐటీ మంత్రి కావాలని బాధపడితే ఇప్పుడేం వస్తది - కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
KT Rama rao : ఎన్నికలైపోయిన తరువాత మంచి ఐటీ మినిస్టర్ కావాలని బాధపడితే ఇప్పుడేం లాభమని బీఆర్ఎస్ నాయకుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. కేటీఆర్ లాంటి మంచి ఐటీ మినిస్టర్ ను కోల్పోయామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
Vidyasagar Rao : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుండగా.. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిచనుంది. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. పూర్తి మెజారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అందులో సీఎల్పీ నాయుకుడిని ఎన్నుకోనున్నారు. దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు సీఎంగా ఖరారు అయినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం ఎవరవుతారనే చర్చ కంటే.. ఐటీ మినిస్టర్ గా ఎవరు బాధ్యతలు చేపడుతారనే విషయమే అందరి మెదళ్లలో తిరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత దాదాపు తొమ్మిదిన్నరేళ్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ బాధ్యతలను కేటీఆర్ నిర్వర్తించారు. రాజకీయాలమాట ఎలా ఉన్నా.. ఆ పదవికి కేటీఆర్ ఎంతో న్యాయం చేశారు. స్వయంగా గతంలో ఐటీ ఉద్యోగైన ఆయన.. హైదరాబాద్ కు ఐటీ సంస్థలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
దేశ, విదేశాల్లో పర్యటించి ప్రముఖ సంస్థలను తెలంగాణకు తీసుకురావడంలో, ఆ సంస్థ ప్రతినిధులను తన వాక్ చాతుర్యంతో ఒప్పించి, పెట్టుబడులను ఆకర్శించడంలో ఆయన సిద్ధహస్తుడిగా పేరు గాంచారు. ఆయన సారథ్యంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయి. స్టార్టప్ లను ప్రొత్సహించడానికి తీసుకొచ్చిన టీ హబ్ సత్ఫలితాలను ఇచ్చింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఐటీ రంగంలో పని చేసే వారే కాక.. ఆ రంగంలో జరిగిన అభివృద్ధి గమనించిన వారంతా ఒకింత నిరాశకు గురవుతున్నారు.
బీఆర్ఎస్ ఓటమి ఖాయమైందనే విషయం స్పష్టమయ్యాక సోషల్ మీడియాలో మొత్తం ఇదే చర్చ జరిగింది. మంచి ఐటీ మంత్రిని కోల్పోయామంటూ సోషల్ మీడియా యూజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ఫొటోలను షేర్ చేస్తూ బాధపడుతున్నారు. అయితే దీనిపై తాజాగా బీఆర్ఎస్ నాయకుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్పందించారు. ఎన్నికలైపోయిన తరువాత మంచి ఐటీ మంత్రి కావాలని బాధపడితే ఏం లాభమని అన్నారు.
‘‘ ఓట్లప్పుడు కులం కావాలి, మతం కావాలి.. ఇప్పుడు ఓట్లయిపోయాక... మంచి ఐటీ మంత్రి కావాలి అని బాధ పడితే ఎం వస్తది మిత్రులారా?’’అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రిగా ఎవరుంటారు ? కేటీఆర్ లాగే ఆయన ఆ పదవికి న్యాయం చేస్తారా ? ఇప్పుడు ఐటీ రంగం గతం మాదిరగానే అభివృద్ధి చెందుతుందా ? అనే చర్చ జరుగుతుంది.
- Election results in Telangana
- KTR
- Telangana Assembly Election Result 2023
- Telangana Election 2023 Results
- Telangana Election Counting
- Telangana Election Results
- Telangana Elections
- Telangana IT Minister
- Telangana Poll Result
- Telangana assembly election results 2023
- former Korutla MLA Vidyasagar Rao
- KT Rama rao