దొరగారి కాపలా కుక్కలా .. ఆ 12 మందిని అసెంబ్లీ గేటు తాకనీయొద్దు: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకున్నారని ప్రశంసించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనీయొద్దని సూచించారు. చిరుమర్తి లింగయ్య నమ్ముకున్న వారిని నట్టేట ముంచి పార్టీ ఫిరాయించారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకున్నారని ప్రశంసించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనీయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను, ప్రజలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నల్గొండ గడ్డ నాయకత్వం వహించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. రజాకార్ల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించింది నల్గొండ వీరులేనని ఆయన ప్రశంసించారు. తెలంగాణ కోసం పదవిని పూచికపుల్లలా విసిరేశానని కేసీఆర్ పదే పదే అంటారని, కానీ వాళ్లు రాజీనామా పేరుతో ఎన్నికలు, కలెక్షన్ల పేరుతో ఆస్తులు సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలు, కోమటిరెడ్డి సోదరులు కష్టపడి గెలిపిస్తే.. చిరుమర్తి లింగయ్య నమ్ముకున్న వారిని నట్టేట ముంచి పార్టీ ఫిరాయించారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరగారి గేటు వద్ద కాపలా కుక్కలా మారాడని ఆయన దుయ్యబట్టారు.
Also Read: Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి
అంతకుముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తి చేసిన రేవంత్.. కాగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు వృద్ధాప్య పింఛను రూ.4వేలు అందజేస్తామనీ, చర్లపల్లి సెంట్రల్ జైలులో ఆయనకు 2బీహెచ్‌కే ఇంటిని నిర్మిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రస్తుతం ఇస్తున్న రూ.2,016 వృద్ధాప్య పింఛను రూ.4,000కు పెంచుతుందని రేవంత్ ఉద్ఘాటించారు. పేదలకు 2బిహెచ్‌కె గృహాలను అందజేస్తామని కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. "కేసీఆర్ వచ్చే నెలలో పదవీ విరమణ చేస్తున్నారు.. కాంగ్రెస్ రూ. 4,000 పెన్షన్ ఇస్తుందనే విషయం కూడా ఆయన తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో ఇందిరమ్మ రాజ్యం 2బీహెచ్‌కే ఇల్లు కట్టిస్తుందని" అని వ్యాఖ్యానించారు.