తెలంగాణ రాజకీయాల్లో నక్సలిజం ప్రస్తావన.. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో ఈ రోజు ఆసక్తికరంగా నక్సలిజం ప్రస్తావన వచ్చింది. టీపీసీసీ రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే నక్సలిజం వస్తుందని వివరించారు. అప్పుడు అసమానతలు ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణలోనూ నక్సలైట్ల కార్యకలాపాలు జరిగాయి. ఒకప్పుడు నక్సలిజం ప్రజా ఉద్యమంగా సాగింది. కానీ, ఆ తర్వాత అది మసకబారిపోయింది. ఇప్పుడు నక్సలిజం ప్రభావం చాలా వరకు కనుమరుగైపోయింది. అది కొంత మేరకు అటవీ ప్రాంతానికి పరిమితమైపోయింది. కానీ, ఇప్పటికీ నక్సలైట్లు అంటే తెలుగు ప్రజల్లో ఒక ఉద్వేగం కనిపిస్తుంది. రాజకీయాలపై విసిగివేసారిపోయినప్పుడూ నక్సలిజం ప్రస్తావన సాధారణ ప్రజల్లో చర్చల్లో వినిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా రక్తసిక్తమైన నక్సలిజం దారిని వ్యతిరేకించడంలో అందరూ ఏకీభవిస్తారు. అయితే, ఈ నక్సలిజం ప్రస్తావన ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో వచ్చింది.
రేవంత్ రెడ్డి కామెంట్..
పీడన, దోపిడీ పరాకాష్టకు పోయినప్పుడు పీడితుడు, బాధితుడు ఆయుధం చేతబడతారని వామపక్ష వర్గాలు చెబుతుంటాయి. టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా అదే కోణంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తున్నదని, ఇప్పటికీ యువత హైదరాబాద్‌లో కోచింగ్‌లు తీసుకుంటూ.. నోటిఫికేషన్లు రద్దు చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగం మరింత హెచ్చుతుందని ఆరోపించారు. అప్పుడు యువత మరే దారి లేక అడవి బాట పడతారని అన్నారు. బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే నక్సలిజం వస్తుందని, యువత అడవిలో అన్నలుగా మారుతారని తెలిపారు. నిరుద్యోగ యువత అడవిబాట పడితే ప్రభుత్వంలో ఒక్కరూ ఉండరని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇందుకోసం ఇవ్వలేదని, రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్లాలని కాంక్షించి ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడి యువత ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, మరెన్నో గొప్ప ఉద్యోగాలు సాధించాలని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామని వివరించారు.
Also Read: గంగుల గురించి తెలిసే ఒవైసీ వద్ద కేసీఆర్ మోకరిల్లాడు: బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కేటీఆర్ కౌంటర్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మినిస్టర్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు నక్సలిజం వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే కదా? అని అన్నారు. అప్పుడు నీళ్లు లేక, పనులు లేక, ఉపాధి ఉద్యోగాలు లేక, సంపద సృష్టి లేక దారుణ దుస్థితి ఉన్నదని వివరించారు. అలాంటి దుర్భర స్థితిలో ముఖ్యంగా యువత తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్లారని తెలిపారు. ఆర్థిక అసమానలు, ఇతర తారతమ్యాల వల్ల వాళ్లు అడవి బాట పట్టారని వివరించారు. అంతేకానీ, అన్నీ సరిగ్గా ఉండగా అడవుల్లోకి వెళ్లడానికి వారికి అదేమైనా షోకా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనే లేవని, ఆ అసమానతలను తగ్గించగలిగామని చెప్పారు.