కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు.. బీఆర్ఎస్-బీజేపీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇదే : రేవంత్ ఆరోపణలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల హక్కులను ఎన్నికల సంఘం కాపాడాలని కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రశ్నించే గొంతులే మిగలకూడదనేది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఐటీ, ఈడీ సంస్థలకు ఎక్కడి నుంచి ఆదేశాలు అందుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల హక్కులను ఎన్నికల సంఘం కాపాడాలని కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల తరపున పోరాడేవారు ద్రోహులు అవుతారా.. బీజేపీ, బీఆర్ఎస్‌లో వున్నవారు మాత్రమే పవిత్రులా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో విపక్షమే ఉండకూడదన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. వివేక్ సహా కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలలో జరిగిన ఐటీ దాడులను తాము కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని రేవంత్ దుయ్యబట్టారు.
బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ.. కాంగ్రెస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్‌లు పావులుగా ఉపయోగించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పెరిగేకొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయని.. కేవలం తమ పార్టీ నాయకులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రశ్నించే గొంతులే మిగలకూడదనేది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఐటీ, ఈడీ సంస్థలకు ఎక్కడి నుంచి ఆదేశాలు అందుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ, అమిత్ షాల ఆదేశాలు లేకుండా దేశంలో చీమ చిటుక్కుమంటుందా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా జరుగుతున్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.