త్వరలోనే తెలంగాణకు మంచి రోజులు: తిరుమల వెంకన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారంనాడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారంనాడు తిరుమల వెంకటేశ్వరస్వామని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతోనే పోటీ పడేలా చూడాలని వెంకటేశ్వర్వస్వామిని కోరుకున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.
నిన్న రాత్రే రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతను రేవంత్ రెడ్డి తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ పై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు.
రాష్ట్రంలోని కొడంగల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల్లో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అనుసరించిన ఫార్మూలానే కాంగ్రెస్ అవలంభిస్తుంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు కూడ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. డీకే శివకుమార్ రెండు దఫాలు ప్రచారం నిర్వహించారు. కర్ణాటక సీఎం మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
also read:కేసీఆర్ పూర్వీకుల కొనాపూర్ గ్రామస్తుల విరాళం: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య ఎన్నికల అవగాహన కుదిరింది. సీపీఐకి ఒక్క అసెంబ్లీ సీటును కాంగ్రెస్ కేటాయించింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి కేటాయించనుంది కాంగ్రెస్. 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.