Rythu Bandhu: రైతు బంధుపై బీఆర్ఎస్‌లో భిన్నస్వరం.. కాంగ్రెస్ తప్పేమీ లేదన్న ఎంపీ కేశవరావు
రైతు బంధుపై బీఆర్ఎస్ భిన్న స్వరం వినిపించింది. పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కేశవరావు సీఈవో వికాస్ రాజ్‌కు బీఆర్ఎస్ తరఫున ఒక మెమోరాండం అందించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్య లు చేశారు. రైతు బంధు నిధుల పంపిణీని కాంగ్రెస్ అడ్డుకున్నదని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్: రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ ఈసీ వెనక్కి తగ్గడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఇంకోసారి వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు వల్లే, కాంగ్రెస్ పార్టీ కుట్ర వల్లే నిధుల పంపిణీకి అనుమతి వెనక్కి తీసుకుందని బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తిపోస్తున్నది. స్వయంగా కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇదే విమర్శలు కాంగ్రెస్ పై చేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు.
రైతు బంధు నిధుల పంపిణీ ఆగిపోవడం కాంగ్రెస్ ప్రమేయం ఏమీ లేదని ఎంపీ కేశవరావు అన్నారు. ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చినప్పుడుకొన్ని నిబంధనలు విధించిందని, ఆ నిబంధనలు పాటించకుండా అందుకు విరుద్ధంగా ఎవరైనా నడుచుకున్నా... మాట్లాడినా వారికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. అంతేకానీ, అనుమతినే వెనక్కి తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ రోజు సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున మెమోరాండం ఇచ్చారు. రైతు బంధు నిధుల పంపిణీని ఆపేయాలనే ఆదేశాలపై ఈసీ పునరాలోచించాలని కోరారు. రైతు బంధు పథకం ఆన్ గోయింగ్ స్కీమ్ అని, అది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్టు భావించరాదని తెలిపారు.
ఈ మెమోరాండంలో మంత్రి హరీశ్ రావు ఎక్కడా రైతు బంధును పబ్లిసైజ్ చేసేలా మాట్లాడలేదని కేశవరావు పేర్కొన్నారు. ఆయన ఎలాంటి నియామవళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. రైతు బంధుకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు మాత్రమే చెప్పారని వివరించారు.
Also Read: Rythu Bandhu: రైతు బంధు పంపిణీకి అనుమతివ్వండి: ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రైతు బంధు నిధుల పంపిణీ అనుమతిని ఉపసంహరించుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. రేపటి కల్లా ఈ ఆదేశాలు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తామని వివరించారు.
లేదంటే రైతులే పరిస్థితులు అర్థం చేసుకుని ఓపిక పట్టాలని కేశవరావు అన్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడే కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు పొందే సమయం లేదని వివరించారు. కానీ, తాము శాయశక్తుల నిధుల పంపిణీకి అనుమతి పొందడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.