Asianet News TeluguAsianet News Telugu

మంచిరెడ్డి, మల్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ:ఇబ్రహీంపట్టణంలో టెన్షన్, పలువురికి గాయాలు


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్టణంలో  ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది.  పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ  టెన్షన్  మరింత ఎక్కువైంది. 

Tension prevails after clashes between BRS And Congress workers in ibrahimpatnam lns
Author
First Published Nov 9, 2023, 2:22 PM IST | Last Updated Nov 9, 2023, 2:39 PM IST

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు గురువారంనాడు ఒకేసారి రావడంతో  రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.ఈ ఘర్షణలో  పలువురికి గాయాలయ్యాయి.  ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.దీంతో  కాంగ్రెస్ అభ్యర్ధి  మల్ రెడ్డి రంగారెడ్డి  కారు దిగి నామినేషన్ వేసేందుకు వెళ్లిపోయారు.

ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  మంచిరెడ్డి కిషన్ రెడ్డి,  కాంగ్రెస్ అభ్యర్ధిగా మల్ రెడ్డి రంగా రెడ్డి బరిలోకి దిగుతున్నారు.ఈ ఇద్దరు నేతలు నామినేషన్లు దాఖలు చేసేందుకు  ఇవాళ ఒకే సమయానికి ఇబ్రహీంపట్టణంలోని రిటర్నింగ్ కార్యాలయం వద్దకు  చేరుకున్నారు. దీంతో  రెండు పార్టీల కార్యకర్తలు  పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. అంతేకాదు  ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో  రెండు పార్టీల కార్యకర్తలు  మధ్య ప్రారంభమైన వాదన చిలికి చిలికి గాలివానగా మారింది. రెండు పార్టీల శ్రేణులు దాడులకు దిగారు.  ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.  దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.  పరస్పర రాళ్ల దాడుల్లో  కార్ల అద్దాలు కూడ ధ్వంసమయ్యాయి. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే  కాంగ్రెస్ అభ్యర్ధి మల్ రెడ్డి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు రిటర్నరింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లారు. 

రెండు వైపులా రెండు పార్టీలకు చెందిన క్యాడర్ నిలబడి  ఘర్షణకు దిగారు.  ఇరు వర్గాల కార్యకర్తలను  పోలీసులు చెదరగొట్టారు.  వీరిని చెదరగొట్టేందుకు  పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.  2009 అసెంబ్లీ ఎన్నికల నుండి ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ స్థానం నుండి  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో  ఆయన  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా కూడ బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగుతున్నారు. 2009 నుండి  2014 ఎన్నికల్లో  ఇబ్రహీంపట్టణం నుండి  మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మలక్ పేట అసెంబ్లీ స్థానం నుండి  మల్ రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. 1994లో టీడీపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి మరోసారి  ఇదే స్థానం నుండి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన  ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకరించారు.  ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ స్థానం నుండి మల్ రెడ్డి రంగా రెడ్డి  గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios