ఆరు నెలలకు సీఎం మారడం గ్యారంటీ: తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ ఎన్నికల సమయంలో అవకాశం దొరికితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎంలు మారడం ఖాయమని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలౌతాయో లేదో చెప్పలేం .. కానీ ఆరు నెలలకో సీఎం మారడం గ్యారంటీ అని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) సెటైర్లు వేశారు.
మంగళవారం నాడు హైద్రాబాద్ లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 11 దఫాలు అధికారం కట్టబెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆరు మాసాలకు ఓ సీఎం మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. బోర్ కొట్టిందంటూ ప్రభుత్వం మారాలని కోరుకుంటారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
సుస్థిర ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే పదవుల కోసం నిత్యం గొడవలే జరుగుతాయన్నారు. తమ పాలనలో రాష్ట్రంలో పదేళ్లుగా శాంతిభద్రతలకు ఎలాంటి సమస్యలు లేవన్నారు.తమ ప్రభుత్వ అందిస్తున్న మౌళిక వసతులతో పాటు సుస్థిర పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నారని ఆయన చెప్పారు.
also read:ప్రజలను మెప్పించి గెలవాలి: గువ్వల బాలరాజును పరామర్శించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితిని బేరీజు వేసుకోవాలని కేటీఆర్ కోరారు. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించుకొంటూ వెళ్తున్నామని కేటీఆర్ చెప్పారు. విద్యుత్, సాగు , తాగు నీటి సమస్యలను పరిష్కరించామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య కొత్త హైద్రాబాద్ నిర్మాణం కానుందని కేటీఆర్ వివరించారు.