Asianet News TeluguAsianet News Telugu

Harish Rao:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీకి ఓట్లెందుకు వేయాలి

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  చేసిన వ్యాఖ్యలకు  మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు.  కేంద్ర విధానాలపై ఆయన మండిపడ్డారు.

Telangana minister Harish rao  responds on union minister nirmala sitaraman comments lns
Author
First Published Nov 22, 2023, 5:39 PM IST


సిద్దిపేట: కేసీఆర్ రైతుల పక్షాన ఉన్నందునే  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని  మంగళవారంనాడు మీడియా సమావేశంలో  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు.ఈ వ్యాఖ్యలపై  బుధవారంనాడు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని  కేంద్ర ప్రభుత్వం చెబుతుందని తాము  ప్రకటిస్తే  బీజేపీకి చెందిన రాష్ట్ర నేతలు  ఖండించిన విషయాన్ని  హరీష్ రావు గుర్తు చేశారు. మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ గారు కుండ బధ్దలు కొట్టారన్నారు. తెలంగాణ బిజెపి నాయకులు, ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని ఆయన ప్రశ్నించారు.

ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారని ఆయన అడిగారు.మోటార్లకు మీటర్లు పెట్టనని అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన  గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ బిజెపి తో పాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారని హరీష్ రావు చెప్పారు. .

ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు, తెలంగాణ లో మీటర్లు అమలు చేయనందున డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారన్నారు.12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నాయి. రైతుల పక్షాల ఆలోచించే కేసీఆర్ ఉన్నందునే  తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని హరీష్ రావు చెప్పారు.కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్టుగా  హరీష్ రావు వివరించారు.తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే  ఇక్కడ కూడా మీటర్లు పెడతారని  మంత్రి హరీష్ రావు చెప్పారు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ బయట పెట్టారన్నారు. కాంగ్రెస్, బిజెపిలు  రైతుల పాలిత శత్రువులని హరీష్ రావు  అన్నారు.  స్వామినాథన్ కమిటీని  కాంగ్రెస్ పార్టీ తొక్కి పెట్టిందన్నారు. మోడీ ఈ రిపోర్టును అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు  చేయలేదని విమర్శించారు.స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. 

బిజెపి పాలిత యూపీ, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారన్నారు.ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళ లో పెట్టిన విషయాన్ని  హరీష్ రావు ప్రస్తావించారు. బిజెపి కాంగ్రెస్ కూటములతో తో సంబంధం లేని పార్టీలు  అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, మేఘాలయాలలో కూడ మీటర్లు పెట్టారని హరీష్ రావు చెప్పారు.ఈ విషయమై తాను సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా...  చర్చకు రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. రైతును నిలబెట్టింది కేసీఆర్, మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలని హరీష్ రావు ప్రజలను కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios