ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఏడో రౌండ్ ముగిసే సరికి ఈ రెండు స్థానాల్లోనూ ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో మూడో స్థానంలో నిలవగా.. గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలిచారు. 

హైదరాబాద్: బీజేపీ అభ్యర్థి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదనే తీరులో ఫలితాల సరళి కనిపిస్తున్నది. ఇటు సొంత నియోజకవర్గం హుజురాబాద్‌తోపాటు గజ్వేల్‌లోనూ ఆయన వెనుకంజలో ఉన్నారు. 

హుజురాబాద్ బైపోల్‌లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ ఈ సారి ఇక్కడ సునాయసంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అనూహ్యంగా పుంజుకున్నారు. ఆయన ముందంజలో ఉన్నారు. ఎన్నికల సంఘం అందించిన సమాచారం ప్రకారం హుజురాబాద్‌లో లీడ్‌లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వొడితల ప్రణవ్, ఈటల రాజేందర్‌లు ఉన్నారు. అంటే ఏడో రౌండ్ ముగిసే సరికీ ఈటల రాజేందర్ మూడో స్థానంలో నిలిచారు.

హుజురాబాద్‌తోపాటు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పైనా గజ్వేల్ స్థానంలో పోటీలో నిలిచారు. ఇక్కడా ఆయన వెనుకంజలోనే ఉన్నారు. సీఎం కేసీఆర్ ఊహించినట్టుగానే భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తొలి స్థానంలో కే చంద్రశేఖర్ రావు ఉండగా, ఈటల రాజేందర్ రెండో స్థానంలో ఉన్నారు.

Also Read: Telangana Election Results 2023: ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడించిందా ?!

అయితే, ఈటల రాజేందర్ జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందు వంటి స్థానాల్లో తనకు ఓట్లు పడతాయని భావిస్తున్నారు. కాబట్టి, మరికొన్ని రౌండ్‌లలో ఫలితాలు తారుమారు అవుతాయని అనుకుంటున్నారు. ఆయన హుజురాబాద్ పై కంటే కూడా గజ్వేల్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఆయన భార్య జమున ఎక్కువగా హుజురాబాద్ ‌లో ప్రచారం చేశారు.

దీనికితోడు ఎన్నికల క్యాంపెయిన్ చివరి రోజున పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ అవి ఓటర్లను ప్రభావితం చేసినట్టు చెబుతున్నారు.