Telangana Elections : గెలుపు దిశగా కాంగ్రెస్.. గాంధీ భవన్ లో మొదలైన సంబరాలు.. తాజ్ కృష్ణ వద్ద బస్సులు రెడీ
Telangana Election Results 2023 : కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అనేక మంది కార్యకర్తలు గాంధీ భవన్ కు చేరుకొని సంబరాలు మొదలుపెట్టారు. మిటాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. అశ్వారావుపేటలో మొదటి విజయంతో ఆ పార్టీ బోణీ కొట్టింది. దీంతో పాటు మరో మూడు స్థానాల్లోనూ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇంకా ఆ పార్టీ 64 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీయే తెలంగాణ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నా.
అయితే ఈ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ కు చేరుకొని సంబరాలు మొదలుపెట్టారు. అక్కడ ఆ పార్టీ శ్రేణులు డ్యాన్సులు చేస్తూ, టపాకులు కాలుస్తూ కేరింతలు కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యాలయాల్లో హడావిడి కనిపిస్తోంది. పలు చోట ఆ పార్టీ కార్యకర్తలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. గెలిచిన అభ్యర్థుల కోసం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ వద్ద బస్సులు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతీ అభ్యర్థి వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీ పరిశీలకులను ఉంచింది. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థికి అధికారులు సర్టిఫికెట్ అందజేసిన వెంటనే వారిని తీసుకొని పరిశీలకులు హైదరాబాద్ కు రానున్నారు. తాజ్ కృష్ణకు చేరుకున్న ఎమ్మెల్యేలను బస్సుల్లో కర్ణాటకకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడి ఎన్నికల ఫలితాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించే అవకాశం రాదని ఆయన శనివారం స్పష్టం చేశారు. అయినప్పటికీ హైకమాండ్ అందించిన బాధ్యతలను తాను తప్పకుండా నిర్వర్తిస్తానని వెల్లడించారు.