ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి రండి.. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. 2023 డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందన్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయి నేతలు, ప్రముఖులకు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. విద్యార్ధుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు , బడుగు, బలహీన వర్గాలు , దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందన్నారు. మీ అందరికీ ఇదే ఆహ్వానమని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులతో భేటీ అయి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే మంత్రి వర్గ కూర్పుపై అధిష్టానానికి సూచనలు ఇచ్చారు. ఈ రాత్రికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకునే అవకాశాలు వున్నాయి.
అంతకుముందు మంగళవారం సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. నిన్న సీఎల్పీ మీటింగ్ జరిగిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమకు అధికారాన్ని అప్పగించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీసుకున్నారని వేణుగోపాల్ వెల్లడించారు.
ఉదయం నుంచి ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో సీఎం ఎంపికపై చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని వేణుగోపాల్ అన్నారు. డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు.