Telangana Assembly Elections 2023 : కాంగ్రేసోళ్ల చేతిలో అడ్డంగా బుక్కయిన పోలీస్ ... వేటు పడింది...
సాధారణంగా ఎన్నికల వేళ రాజకీయ నాయకులు డబ్బులు తరలిస్తే పోలీసులు పట్టుకుంటారు... కానీ హైదరాబాద్ లో సీన్ రివర్స్ అయ్యింది. ఓ పోలీస్ డబ్బులను తరలిస్తుండగా నాయకులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బులతో పట్టుబడ్డ పోలీస్ అధికారిపై వేటు పడింది. వరంగల్ అర్భన్ సీఐ అంజిత్ రావు నిన్న(మంగళవారం) మేడ్చల్ జిల్లాలో డబ్బులతో పట్టుబడ్డాడు. ఎన్నికల ప్రచారం చివరిరోజు అతడు ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్న అనుమానించి డబ్బులతో పాటు కారును కూడా ఈసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్న సమయంలో ఇలా పోలీస్ అధికారి డబ్బులతో పట్టుబడడాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో సదరు సీఐను సస్పెండ్ చేసారు.
అసలేం జరిగింది :
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్లలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే ఆ కారును అడ్డుకుని అందులోని వ్యక్తిని కిందకుదింపారు. కారుతో వెతకగా ఓ బ్యాగ్ లో నోట్లకట్టలు కనిపించాయి. ఈ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించినా అతడి నుండి సమాధానం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహించారు. అతడిపై దాడి చేయడమే కాదు ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకే అతడు ఈ డబ్బులు తరలిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి కోసమే ఈ డబ్బులు తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసారు. అక్కడికి చేరుకున్న ఈసి అధికారులు డబ్బులతో పట్టుబడింది వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ కుమార్ గా గుర్తించారు. తాజాగా అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు.
ఎలాంటి అక్రమాలు, అలజడులే జరగకుండా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన పోలీసే ఇలా డబ్బులతో పట్టుబడటం దారుణమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా ఒక్క అంజిత్ కుమార్ మాత్రమే కాదు చాలామంది అధికారులు బిఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని... అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.