k.chandrashekar rao...కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కథ కంచికే: బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్
ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ విపక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ హయంలో జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నారు.
హైదరాబాద్:కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కథ కంచికే అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రగల్బాలు మీకందరికి తెలుసునని చెప్పారు. నకిరేకల్ లో గెలిచిన తర్వాత రామన్నపేట నుండి నకిరేకల్ వరకు తాము అందరిని పండబెట్టి తొక్కుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారని తనకు నకిరేకల్ లో చెప్పారన్నారు.పండబెట్టి తొక్కేవాళ్లే మనకు ఎమ్మెల్యేలు కావాలా అని ఆయన ప్రశ్నించారు. భూపాల్ రెడ్డి ఓడినా గెలిచినా ప్రజల మధ్యే ఉన్నారని చెప్పారు.
ఓడినా గెలిచినా కూడ ప్రజల మధ్యే భూపాల్ రెడ్డి ఉంటాడన్నారు. గతంలో భూపాల్ రెడ్డి ఓటమి పాలైనా ఇక్కడే ఉన్నాడని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజల మధ్య ఉండే వారు ఎమ్మెల్యేలుగా కావాలా.. గెలవగానే హైద్రాబాద్ లో ఉండేవాళ్లు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు కేసీఆర్.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం తన దత్తత కిందే ఉందన్నారు. ప్రస్తుతం చేసిన అభివృద్ది కంటే ఇంకా మరింత అభివృద్ది చేస్తామని కేసీఆర్ చెప్పారు.తమ పాలనలో తెలంగాణలో కర్ఫ్యూ లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నిత్యం కర్ఫ్యూలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.యాభై ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నమే లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టిండని ఆయన ప్రశ్నించారు.రెండు రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా కొంచెం పేదల కడుపు నిండిందని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇందిరమ్మ రాజ్యం బాగుంటే మనోళ్లు బొంబాయి, భీవండిలకు ఎందుకు వలస పోయారని కేసీఆర్ ప్రశ్నించారు.ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ పెట్టి అందరినీ పట్టుకపోయి జైళ్లేసుడు, ప్రభుత్వాలు కూలగొట్టుడేనా? అని ఆయన అడిగారు. 1956 లో తెలంగాణను ఆంధ్రాలో కలుపొద్దని మొత్తుకున్నా వినలేదన్నారు.కాంగ్రెస్ ఆనాడు చేసిన తప్పిదానికి 58 ఏండ్లు కొట్లాడితే గానీ బయటపడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చిచంపిందని ఆయన చెప్పారు.2004లో తెలంగాణ ఇస్తమని మనతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వని విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తాను దీక్ష చేస్తేనే తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. 15 ఏళ్లు పేగులు తెగేదాక కాంగ్రెస్ తో కొట్లాడిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని కేసీఆర్ గుర్తు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు.నాడు కాంగ్రెస్ హయాంలో పెన్షన్ రూ.200 మాత్రమే ఉంటే తమ ప్రభుత్వం పెంచిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
దేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చేది ఒక్క మన తెలంగాణలోనేనని కేసీఆర్ చెప్పారు. ఆటో రిక్షా వాళ్లకు ఇండియా మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఆటో రిక్షా కార్మికులకు ఎన్నికల తర్వాత ఫిట్ నెస్ కు సంబంధించిన ఫీజులు లేకుండా రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. కరీంనగర్ అమ్మాయినే నేను పెండ్లి చేసుకున్న. కరీంనగర్ కు నాకు ఏదో వైబ్రేషన్ ఉన్నది.మన ప్రభుత్వంలో నీటి తీరువా పాత బకాయీలను తీర్చడమే గాకుండా, మొత్తానికే రద్దు చేసినట్టుగా కేసీఆర్ చెప్పారు.రైతులకు 24 గంటల ఉచిత కరెంటును ఇస్తున్నాం.కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా విన్నామా ‘రైతు బంధు’ అనే పదం అని ఆయన ప్రశ్నించారు.‘రైతు బంధు’ పుట్టించిందే కేసీఆర్ అని ఆయన చెప్పారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించిన విషయాన్ని కేసీఆర్ తెలిపారు. రైతు బంధు వేస్ట్ అని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నరు. రైతు బంధు ఉంచాలా, వద్దా అని ఆయన ప్రజలను అడిగారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందా, 24 గంటలు ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ 24 గంటల కరెంటు ఇస్తున్న మన దగ్గరికొచ్చి తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్న విషయాన్ని ప్రకటించారన్నారు. ధరణిని తీసేసి భూమాత అనే పోర్టల్ పెడతామని కాంగ్రెస్ చెబుతుందన్నారు. కాంగ్రెస్ పెట్టేది ‘భూమాత’ కాదు.. భూ‘మేత’ అని కేసీఆర్ విమర్శించారు. రైతులకు, కౌలుదార్లకు జుట్లు జుట్లు ముడేసి పంచాయతీ పెట్టించి పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. రైతుల భూములపై సర్వ హక్కులను తమ ప్రభుత్వం రైతులకే కట్టబెట్టిందన్నారు.