కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి...: హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఎప్పటికైనా బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు ల మధ్య పదవుల కోసం గొడవలు జరగడం ఖాయమని కాంగ్రెస్, బిజెపి నాయకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శలకు అన్నిపార్టీల నాయకులు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఇలా కేసీఆర్ కుటుంబంలో పదవుల విషయంలో గొడవలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బిఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవికోసం కేటీఆర్, హరీష్ రావు మధ్య గొడవలు జరగడం ఖాయమని... బిఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోతుందని కాంగ్రెస్, బిజెపి నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి తిరిగి ఆధికారంలోకి తీసుకువచ్చేందుకే తాను పనిచేస్తున్నానని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రిని కావాలని... అధికారం చెలాయించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. మన పనితీరును బట్టి ప్రజలే పదవులు కట్టబెడతారని అన్నారు. తనకు కేటీఆర్ తో మంచి స్నేహం వుందని... అతడిని ముఖ్యమంత్రి చేస్తే తప్పకుండా అంగీకరిస్తానంటూ హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తాను పదవుల కంటే వ్యక్తిత్వమే గొప్పదని భావిస్తానని హరీష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా పదవుల కోసం గొడవలు పడే సంస్కృతి బిఆర్ఎస్ లో వుండదన్నారు. అధినేత కేసీఆర్ నిర్ణయమే ప్రతి ఒక్కరికీ శిరోదార్యమని అన్నారు. తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన ఇలాగే కొనసాగాలంటే బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా సంక్షేమ పాలన కొనసాగుతుందని హరీష్ స్పష్టం చేసారు.
Read More ముగిసిన నామినేషన్ల పరిశీలన ... ఏకంగా 772 సెట్ల తిరస్కరణ ... ఆ సీనియర్లకు బిగ్ షాక్
కాంగ్రెస్ లాంటి పార్టీ చేతుల్లోకి కాంగ్రెస్ వెళ్లడం మంచిది కాదని హరీష్ రావు అన్నారు. అసలు ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసిందే కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందిస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు... అసలు ఆయనకు హార్స్ పవర్ అంటే ఏంటో తెలుసా అంటూ హరీష్ ఎద్దేవా చేసారు.
రైతుబంధు ఇస్తే బిచ్చం వేస్తున్నారని రేవంత్ అంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వ్యక్తి చేతుల్లోకి పోతే రాష్ట్రం ఏమైపోతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందని.. కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో భూముల విలువ పెరిగిందని హరీశ్ రావు తెలిపారు. కర్ణాటకలో 2 , 3 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని మంత్రి చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ చేశారని హరీశ్‌రావు ప్రశంసించారు.
రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని.. అందుకే కరెంట్, రైతుబంధు, ధరణి గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు మీద తప్పులు చేస్తోందని హరీశ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిచ్చేవని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ గొప్పలు చెబుతున్నారని హరీశ్ చురకలంటించారు.