Telangana Assembly Elections 2023 : తెలంగాణలో 144 సెక్షన్... పోలీస్ శాఖ హైఅలర్డ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎన్నికల ప్రచారపర్వం ముగియడంతో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 30న అంటే రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగింపుతో అమల్లోకి వచ్చిన ఈ పోలీస్ ఆంక్షలు రేపు సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు అమల్లో వుండనున్నాయి. ప్రజలు ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకే పోలింగ్ వేళ ఇలా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది. గురువారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుండి సాయంత్రం ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు అమల్లో వుండనున్నాయి. ఓటు హక్కును వినియోగించుకునే వారు మినహా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలింగ్ సెంటర్ల వద్ద గుమిగూడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రెండ్రోజులు సెలవు ఇచ్చారు. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఈసి సూచించింది. అన్ని సంస్థలు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసి వెల్లడించింది.
Read More పోలీసుల వార్నింగ్.. ఎన్నికల నిబంధనలను ధిక్కరించిన రేవంత్ రెడ్డి సోదరుడు
ఇక ఇవాళ రాత్రికే పోలింగ్ మెటీరియల్ తో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం 5 గంటలనుండే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. పోలింగ్ కేంద్రాల్లో అంతా సెట్ చేసుకుని ఉదయం 5.30 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుతుంది. అంతా సజావుగా వుందని నిర్దారణకు వచ్చాకే పోలింగ్ ప్రారంభంకానుంది. ఈవిఎం మిషన్లలో ఏదయినా సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి టెక్నికల్ టీమ్స్ ను రెడీగా వుంచుతోంది ఈసి.
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రంలోని 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు ద్వారా వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇప్పటికే హోరాహోరీ ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ గెలుపుపై ధీమాతో వున్నారు... మరి ఓటర్ల తీర్పు ఎలా వుండనుందో చూడాలి.