Telangana Elections: ఎన్నికల బాధ్యతల్లో ఉన్న అధికారికి గుండెపోటు, మృతి
సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగికి గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే సమీప హాస్పిటల్ తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చెదురు మదురు ఘటనలు మినహాయిస్తే ఇప్పటి వరకు పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతున్నది. అయితే, సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగికి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే మరణించాడు.
మృతుడిని 48 ఏళ్ల సుధాకర్‌గా గుర్తించారు. ఆయన వెటెరినరీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్టు వివరించారు. ఆయన పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌లో 248 పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా సుధాకర్‌కు గుండె పోటు వచ్చింది. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే సుధాకర్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాగా, తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట,భద్రాచలం నియోజకవర్గాల్లో ఇవాళ నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్నవారిని మాత్రమే ఓటింగ్ కు అనుమతిస్తారు. కొత్తగా క్యూలైన్లలోకి చేరేందుకు అనుమతించరు.