Neelam Madhu: బీఆర్ఎస్ టు కాంగ్రెస్ టు బీఎస్పీ.. పటాన్‌చెరులో ‘నీలం’ టికెట్‌పై బరిలో మధు
బలమైన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నేత నీలం మధు ఎట్టకేలకు బీఎస్పీ టికెట్‌ను సాధించుకున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. లిస్టులో పేరు వచ్చినా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో బీఎస్పీలోకి వచ్చి టికెట్ అందిపుచ్చుకుని పటాన్ చెరు నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు.
హైదరాబాద్: ఎన్నికలు రాగానే ఆశావహులు టికెట్ల కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. తమ సామర్థ్యాన్ని మొత్తం వినియోగించి టికెట్ పొందేందుకు యత్నిస్తారు. కానీ, అన్నిసార్లు టికెట్ అనుకున్న రీతిలో సాధ్యం కాకపోవచ్చు. చాలా సార్లు నిరాశే ఎదురవ్వొచ్చు. నీలం మధు కూడా అనేక ప్రయత్నాలు చేశారు. రెండు పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడినా.. మూడో పార్టీలో మాత్రం టికెట్ సాధించి బరిలో నిలబడ్డారు.
వార్డ్ మెంబర్, సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నీలం మధు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. అయితే, ఆయనతో వచ్చిన విభేదాలతో దూరం పెరిగింది. పటాన్ చెరు టికెట్ తనకే కావాలని బీఆర్ఎస్ నాయకత్వానికి సంకేతాలు పంపారు. కానీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కేసీఆర్ మళ్లీ మహిపాల్ రెడ్డికే టికెట్ కేటాయించారు.
నీలం మధు బలమైన ముదిరాజ్ కమ్యూనిటీ నేత. ఆయనకంటూ సొంత క్యాడర్ తయారు చేసుకున్నారు. ఆయన ఎలాగైనా ఈ ఎన్నికల బరిలో నిలబడాలని నిశ్చయించుకున్నారు. కానీ, బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వెంటనే కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. పటాన్ చెరు టికెట్ ఇవ్వాలనే హామీతోనే హస్తం గూటికి చేరారు. ఇచ్చిన హామీకి కట్టుబడి నీలం మధు పేరును జాబితాలో పటాన్ చెరు అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, బీఫామ్ ఇవ్వలేదు. దీంతో నీలం మధు మరోసారి అలర్ట్ అయ్యారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై కాటా శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు పార్టీ కాటా శ్రీనివాస్‌కే బీఫామ్ ఇచ్చింది.
Also Read: Telangana: చివరి జాబితాలోనూ విజయశాంతికి చోటులేదు.. అసెంబ్లీ బరిలో లేనట్టే
అప్పుడు నీలం మధు వెంటనే బీఎస్పీలోకి వెళ్లారు. అప్పటికి బీఎస్పీ పటాన్ చెరు టికెట్ పెండింగ్‌లో పెట్టింది. నీలం మధు రావడంతో ఆయనకే పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఎట్టకేలకు నీలం మధు బీఎస్పీ టికెట్ సాధించి బరిలో నిలిచారు. బీఎస్పీ టికెట్ పై పటాన్ చెరు స్థానంలో పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. నీలం మధు టికెట్ కోసం కేవలం 15 రోజుల్లోనే మూడు పార్టీలు మారడం చర్చనీయాంశమైంది.