Asianet News TeluguAsianet News Telugu

నన్ను చంపేందుకు కుట్రలు...  మాజీ నక్సలైట్లు, రౌడీలు రంగంలోకి..: పుట్టా మధు ఆందోళన

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాజీ నక్సలైట్లు చంద్రయ్య, బక్కరావుతో పాటు కొందరు రౌడీలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని...  వీరిద్వారా మంథనిలో అరాచకాలు సృష్టిస్తున్నారని బిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు ఆందోళన వ్యక్తం చేసారు. 

Manthani BRS Candidate Putta Madhu serious on Congress  MLA Sreedhar Babu AKP
Author
First Published Nov 23, 2023, 8:06 AM IST

పెద్దపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కాయి. పలు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతుంటే... కొన్నిచోట్ల మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇలా పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల తీరుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమవారిపై అధికార పార్టీ నేతలు దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తుంటే... ఏకంగా తనను చంపేందుకే కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు ఆరోపిస్తున్నారు. ఇలా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకుంది.  

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తనను చంపించడానికి ప్రయత్నిస్తున్నాడని బిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు ఆరోపించాడు. ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ గ్యాంగ్ ను ఏర్పాటుచేసుకున్నాడని అన్నారు. మాజీ నక్సలైట్లు చంద్రయ్య, బక్కరావుతో పాటు కొందరు రౌడీలను కాంగ్రెస్ లో చేర్చుకుని మంథనిలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

మంథని రిటర్నింగ్ అధికారికి శ్రీధర్ బాబు, ఓడేడ్ సర్పంచ్ బక్కరావు లపై పుట్టా మధు పిర్యాదు చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని... అక్రమంగా సంపాదించిన డబ్బులు పంచి గెలవాలని అనుకుంటున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే మహాముత్తారంలో బక్కరావు డబ్బులు పంచుతుండగా బిఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారని...  దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని పుట్టా మధు తెలిపారు. 

శ్రీధర్ బాబు మంథనిలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని పుట్టా మధు ఆందోళన వ్యక్తం చేసారు. అధికార బిఆర్ఎస్ నాయకులపైనే దాడులు చేస్తున్నారు... తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని మధు అన్నారు. తనను రాజకీయంగా సమాధి చేయాలన్నదే శ్రీధర్ బాబు ఆలోచన... కానీ మంథని ప్రజల మద్దతు తనకు వున్నన్నిరోజులు ఇది సాధ్యంకాదని మధు పేర్కొన్నారు. తమపైనే దాడులు చేసి తిరిగి తమపైనే సోషల్ మీడియాలో దుష్ఫ్రచారం చేసే కుట్రలు జరుగుతున్నాయని పుట్టా మధు ఆందోళన వ్యక్తం చేసారు. 

 కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాకులు పట్టుకుని తిరిగినా కేసులుండవు... కానీ అధికార పార్టీకి చెందిన తనపైమాత్రం 307 కేసు పెట్టారని మధు అన్నారు. అంటే శ్రీధర్ బాబు ఎలక్షన్ కమీషన్ ను  కూడా వాడుకుంటున్నట్లు అనుమానపడాల్సి వస్తోందన్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ మంథనిలో అరాచకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఓడించడం ద్వారా ప్రజలే బహిష్కరించాలని అన్నారు. ఈసారి మంథని ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తారని... తన గెలుపు ఖాయమని బిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు ధీమా వ్యక్తం చేసారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios