Asianet News TeluguAsianet News Telugu

kt rama rao : చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయా - కేటీఆర్

kt rama rao : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో చాలా రోజుల తరువాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వాస్తవ ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

kt rama rao : Sleep peacefully after long days - KTR..ISR
Author
First Published Dec 1, 2023, 2:07 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఇక ఫలితాలు వెల్లడి కావడమే మిగిలి ఉంది. ఈ ఎన్నికల కోసం దాదాపు రెండు నెలలుగా అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారం అంటూ బిజీ బీజీగా గడిపాయి. ఆయా పార్టీల ముఖ్య నాయకులైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సభల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు తీరిక లేకుండా గడిపారు. 

అయితే నిన్నటి (గురువారం)తో నేతలంతా కాస్తా కుదుటపడ్డారు. ఎవరి నియోజకవర్గంలో వారు ఓటు వేసి, ఫోన్ ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. నేతల భవిత్యవం అంతా ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఎక్కడ ? ఎవరు గెలుస్తారు ? ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి ? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ? ఈ ప్రశ్నలన్నింటికీ ఆదివారం సాయంత్రం నాటికి సమాధానాలు దొరకనున్నాయి. 

కాగా.. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో పలు పార్టీ ముఖ్య నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాల సంగతి పక్కన పెట్టి ప్రశాంతంగా ఉన్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయానని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ హైక్ పెంచొచ్చని, కానీ అసలైన ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. 

ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయని వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి నేతలు, కార్యకర్తలు ఆధైర్యపడవద్దనీ, ఇలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశామని అన్నారు. ‘‘అసలైన ఫలితం డిసెంబర్‌ 3వ తేదీన రాబోతోంది.  70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్‌ కొట్టి.. కేసీఆర్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు ’’అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios