KCR: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ ఫలితాలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిద్దామని చెప్పారు. నాలుగు నెలలు ఆగుదామని, ఆ తర్వాత కార్యచరణ అమలు చేద్దామని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో మూడో సారి తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. అంతేకాదు, దక్షిణాదిలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని చెప్పారు. ప్రజా తీర్పు బీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేసింది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ అసంతృప్తి ఉన్నట్టు చర్చ జరిగింది. అందుకే ఆయన తన రాజీనామాను ఓఎస్డీ ద్వారా గవర్నర్‌కు పంపించి వెంటనే అధికారిక సదుపాయాలు వదులుకుని సామాన్యుడిలా ట్రాఫిక్‌లో సొంత కారులో ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారు. కేటీఆర్ మాత్రమే బీఆర్ఎస్ ఓటమిపై స్పందించారు. కానీ, కే చంద్రశేఖర్ రావు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా, ఆయన ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు.
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కలిశారు. గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని కేసీఆర్ అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో ఏర్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిద్దామనీ పిలుపు ఇచ్చారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా గెలిచింది!!
ప్రజలకు తాము అభివృద్ధి చూపించామని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు వారు ఇచ్చిన తీర్పును శిరసావహిద్దామని తెలిపారు. వారు చెప్పినట్టుగానే ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి నాలుగు నెలల సమయం ఇద్దామని, నాలుగు నెలలు ఆగి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూద్దామని సూచన చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యచరణ అమలు చేద్దామని తెలిపారు.