2018లో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి ? అంచనాలు నిజమయ్యాయా ?
Telangana Assembly Exit Poll Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ సంస్థ అంచనాలు దాదాపుగా నిజమవుతాయని చాలా మంది నమ్ముతారు. మరి ఆ సంస్థ ఈ ఎన్నికల్లో ఏం అంచనా వేసింది ? 2018లో చెప్పినట్టుగానే జరిగిందా ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే ?
India Today-Axis My India exit polls 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ గురువారం ముగిసింది. ఆదివారం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి ? ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది ? ఈ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుందనే వివరాలు రేపు సాయంత్రం వరకు తేలిపోనున్నాయి. అయితే ఈ వాస్తవ ఫలితాల కంటే ముందే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కే అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు ఇదే ఫలితాలు వస్తాయని తేల్చి చెప్పాయి.
అతి కొన్ని సంస్థలు మాత్రమే తెలంగాణలో హంగ్ రావొచ్చని అంచనా వేశాయి. అవన్నీ పోలింగ్ ముగిసిన వెల్లడించిన ఫలితాలు కావడంతో తెలంగాణ ప్రజల్లో కాస్తా గందరగోళం నెలకొంది. అయితే ఫలితాలు అంచనా వేయడంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ సర్వే కోసం అందరూ ఎదురు చూశారు. ఆ ఏజెన్సీ శుక్రవారం సాయంత్రం తన ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చెప్పింది ? 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ సంస్థ విడుదల చేసిన అంచనాలు నిజమయ్యాయా ? ఇక్కడ తెలుసుకుందాం...
2023 ఫలితాలను ఎలా అంచనా వేసిందంటే ?
ఆలస్యంగా విడుదల చేసిన ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని సంస్థల కంటే భిన్నంగా ఏం రాలేదు. ఆ సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుందని చెప్పాయి. బీఆర్ఎస్ రెండో స్థానానికి, బీజేపీ మూడో స్థానానికి పరిమితమవుతుందని పేర్కొంది. ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీ 63 - 73 స్థానాలు, బీఆర్ఎస్ : 34 - 44 స్థానాలు, బీజేపీ : 4 - 8 స్థానాల్లో గెలుపొందనుంని అంచనా వేసింది. అలాగే ఎంఐఎం 5 - 7 స్థానాలు, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించబోతున్నారని వెల్లడించింది.
2018లో ఏం చెప్పిందంటే ?
2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్.. వాస్తవ ఫలితాలకు కాస్త దగ్గరగానే ఉన్నాయనే చెప్పవచ్చు. ఆ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. అప్పుడు బీఆర్ఎస్ 79-91, కాంగ్రెస్ పార్టీ 21-33, బీజేపీ 1-3, ఐఎంఎం 4-7 గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే వాస్తవ ఫలితాలు కూడా దాదాపుగా అదే విధంగా ఉన్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 88, కాంగ్రెస్ 19, బీజేపీ 1, ఎంఐఎం 7, టీడీపీ 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. మరి ఈ ఎన్నికల్లో కూడా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా ? లేక ఆ సంస్థ అంచనాలు దాటి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? ఇవన్నీ తెలియాలంటే మరి కొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.