DMK మద్దతు కాంగ్రెస్‌కే: కేసీఆర్‌కు షాకిచ్చిన ఎంకే స్టాలిన్
తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది. అయితే కాంగ్రెస్ కు ఆ పార్టీ మిత్రపక్షాలు కూడ మద్దతుగా నిలుస్తున్నాయి.
న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ద్రవిడ మున్నెట్ర కజగం (డీఎంకె ) మద్దతిస్తుంది. ఈ మేరకు మంగళవారంనాడు డీఎంకె ఈ విషయాన్ని ప్రకటించింది.
వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఇప్పటికే రెండు దఫాలు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది.మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలు అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని అన్ని అస్త్రాలను ఆ పార్టీ వినియోగించుకొంటుంది. ఇక దక్షిణాదిలో తెలంగాణపై కమలదళం ఫోకస్ పెట్టింద
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డీఎంకె తెలంగాణ ప్రజలను కోరింది. ఈ మేరకు డీఎంకే విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని డీఎంకె సానుభూతిపరులకు ఆ పార్టీ సూచించింది. కాంగ్రెస్ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా పనిచేయాలని ఆ పార్టీ కోరింది.
బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు విషయంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. అయితే ఈ క్రమంలో గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో కూడ ఆయన భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో డీఎంకె భాగస్వామిగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కూడ భారత రాష్ట్ర సమితి భాగస్వామిగా లేదు.
తమిళనాడు రాష్ట్రంలో డీఎంకె, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకె నేతృత్వంలోని సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే.