Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy... కాంగ్రెస్ గెలుపు కోసం నా చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా: రేవంత్ రెడ్డి


రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.  ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పై  పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. 

Congress Will Get Power In Telangana: Revanth Reddy lns
Author
First Published Nov 17, 2023, 10:33 PM IST | Last Updated Nov 17, 2023, 10:33 PM IST


హైదరాబాద్: తెలంగాణలో  కాంగ్రెస్ ను గెలిపించేందుకు తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  చెప్పారు. 

శుక్రవారంనాడు  కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన  కాంగ్రెస్ ఎన్నికల సభలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  తనను  గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలదేన్నారు. 

తనను ఈ స్థాయికి చేర్చడంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ దాగుందని  రేవంత్ రెడ్డి  చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రశ్నిస్తున్నాడన్నారు.  నాగార్జున సాగర్, భీమా,కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లే జరిగాయని ఆయన తెలిపారు.చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందేనని రేవంత్ రెడ్డి  చెప్పారు.హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన తెలిపారు. 

బెంగాలీలు, ఒడిశా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉపాధి కలుగుతుందంటే అది కాంగ్రెస్ కృషివల్లేనని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప మోడీ, కేసీఆర్ చేసిందేం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని ఆయన విమర్శలు చేశారు. 
కేసీఆర్ లోపభూయిష్ట విధాలతో అవినీతి పెరిగిందన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

మేడిగడ్డ బ్యారేజీ  కేసీఆర్ అవినీతికి, దోపిడీకి బలైందన్నారు.త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందని ఆయన విమర్శించారు.నిన్న కర్ణాటక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది.నేడు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

also read:బీఆర్ఎస్‌ కోసం బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది: కుత్బుల్లాపూర్ సభలో మల్లికార్జున ఖర్గే

2024లో ఖర్గే నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామన్నారు. బరాబర్ కేసీఆర్ ను దించుడే.. దంచుడే అని ప్రజలు అంటున్నారని తెలిపారు. కుత్బుల్లాపూర్ లో కొలను హన్మంతరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios