N.Uttam Kumar Reddy:యుద్ధభూమిలో శత్రువులపై పోరు: పైలట్ నుండి పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ప్రస్థానం
తెలంగాణ కాంగ్రెస్ లో నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో అనతికాలంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక స్థానానికి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
హైదరాబాద్: శత్రు దేశాలతో యుద్ధ భూమిలో పోరాటం చేసిన నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (nalamada uttam kumar reddy)
రాజకీయాల్లో ప్రత్యర్థులపై పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడ రేసులో ఉంది. రాష్ట్రపతి భవనంలో ఉద్యోగాన్ని వదిలేసుకొని రాజకీయాల్లో రాణిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అనతికాలంలో సీఎం పదవికి పోటీదారుడిగా మారారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సుధీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కూడ పనిచేశారు. కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాల నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు. నల్గొండ ఎంపీగా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
1962 జూన్ 20వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తాటిపాముల గ్రామం. పురుషోత్తం రెడ్డి, ఉషాదేవి దంపతుల కొడుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి. ఆమె గతంలో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం మరోసారి ఆమె కోదాడ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు పిల్లలు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద్రాబాద్ లో బీఎస్‌సీ పూర్తి చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పుణెలో పట్టా పొందారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలెట్ గా పనిచేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్ 21, మిగ్ 23 యుద్ధ విమానాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి నడిపేవాడు. ఒక రోజున ఆయన ప్రయాణీస్తున్న విమానం పేలిపోయింది.ఈ ప్రమాదంలో విమానం నుండి అత్యవసర బటన్ నొక్కి బయటకు పడ్డాడు.ఈ ప్రమాదంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెన్నుకు గాయమైంది. అంతేకాదు శరీరంలో కొంత భాగం కాలిపోయింది.ఆరు మాసాల పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కూడ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ నుండి రాష్ట్రపతి భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విధుల్లో చేరాడు.రాష్ట్రపతి భవన్‌లో భద్రత, ప్రోటోకాల్, అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా పనిచేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రవేశం
చిన్నతనం నుండి దేశానికి సేవ చేయాలనే తపన ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఉండేది. తన స్నేహితులతో కూడ ఇదే విషయాన్ని ఆయన చెప్పేవారు.ఈ కారణంగానే ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ గా చేరాడు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధుల్లో చేరారు. రాష్ట్రపతి భవన్ లో విధుల్లో ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (Congress) పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరారు.1994 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి వేనేపల్లి చందర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.1999లో టీడీపీ అభ్యర్ధిపై వేనేపల్లి చందర్ రావు పై 7309 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కోదాడ (kodad Assembly segment) నుండి పలు దఫాలు విజయం సాధించిన తెలుగుదేశం (telugu desam party)పార్టీ అభ్యర్థి వేనేపల్లి చందర్ రావు (venepalli chander rao)పై ఓడించారు.2004లో కూడ కోదాడ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన రెండోసారి విజయం సాధించారు. రెండో దఫా వేనేపల్లి చందర్ రావుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి 23,787 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కోదాడలోని కొన్ని మండలాలను మిర్యాలగూడలోని కొన్ని మండలాలను కలిపి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో 2009లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి (guntakandla jagadish reddy)పై 29,194 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా కాసోజు శంకరమ్మ (kasoju shankaramma) ఈ స్థానం నుండి బరిలో నిలిచింది.ఈ ఎన్నికల్లో కాసోజు శంకరమ్మపై ఉత్తమ్ కుమార్ రెడ్డి 23,924 ఓట్ల మెజారిటీతో నెగ్గారు.
2018 లో కూడ హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఏప్రిల్ లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు.ఈ స్థానానికి 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి నలమాద పద్మావతిపై విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా మరోసారి హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగారు. కోదాడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి (nalamada padmavathi reddy) పోటీ చేస్తున్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై చర్చించడం కోసం 2011 జనవరిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2015 మార్చి నుండి 2021 జూన్ వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డితో భర్తీ చేసింది కాంగ్రెస్ నాయకత్వం.
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే తాను గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిన బూనారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది.బీఆర్ఎస్ రెండో దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.