CM Revanth Reddy: కాంగ్రెస్ కరెంట్ కష్టాలు? నేడు ఉదయం ఉన్నతాధిరులతో సీఎం భేటీ
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పై కరెంట్ కోతల ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా చేసింది. దీంతో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రూ. 85 వేల కోట్ల అప్పు ఉన్నదని అధికారులు చెప్పడంతో కరెంట్ కోతలకు కేసీఆర్ కుట్ర చేశారా? అని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాలు దాచి కరెంట్ సంక్షోభానికి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలకు కారణమైంది. తాము కూడా 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పినా బీఆర్ఎస్ దాడికి దిగింది. కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే సాగుకు అందుతుందని కేసీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే ఉన్నదనీ క్యాంపెయిన్ చేశారు. అయినా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి క్యాబినెట్ భేటీలోనే ఇందుకు సంబంధించిన స్పష్టత ఇచ్చింది. 24 గంటల కరెంట్ అందిస్తామని భేటీ అనంతరం, మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి.. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి, వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు దాచారని ఆగ్రహించారు. ఇందుకు సంబంధించి రూ. రూ. 85 వేల కోట్ల అప్పు ఉన్నదని అధికారులు చెప్పారు. దీంతో ఈ వివరాలను దాచారని, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చే కుట్ర జరిగిందని ఆరోపించినట్టు సమాచారం. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా వివరాలు అడగ్గా.. తాను అన్ని డాక్యుమెంట్ల సమాచారం వెంట తేలేదని కార్యదర్శి వివరించినట్టు తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Hyderabad: ఒక రౌడీ షీటర్.. రూ. 100 కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టాడు? ఈడీ దర్యాప్తు
సీఎండీ ప్రభాకర్ రాజీనామాను ఆమోదించరాదని, ఆయన కూడా నేటి సమావేశంలో పాల్గొనాలని కోరారు. ఆయనను రప్పించాలని ఉన్నత అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సీరియస్ గా ఉన్నారని అర్థం అవుతూనే ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని వదంతలు ప్రచారం అవుతున్నాయి. కరెంట్ కోతలు మళ్లీ వస్తాయని, పింఛన్‌లు, రైతు బంధు డబ్బులూ ఆలస్యంగా పడతాయనీ ఆ ప్రచారంలో ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో కొన్ని నిమిషాలపాటు కరెంట్ పోయినా.. రేవంత్ రెడ్డి, కేసీఆర్‌నే గుర్తు చేసుకుంటున్నారు.
పరిపాలనలో ముఖ్యంగా, సేవల్లో, పథకాల్లో ఏ తేడా కనిపించినా కాంగ్రెస్ పై వెంటనే నింద పడే అవకాశం ఉన్నది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. విద్యుత్ శాఖలో భారీ స్థాయిలో అప్పు ముందుకు రావడంతో ఆయన షాక్ అయినట్టు సమాచారం. వెంటనే విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో నేడు ఉదయం భేటీ కానున్నారు. కాంగ్రెస్ 24 గంటలపాటు నిరంతరాయంగా సరఫరా చేసినన్ని రోజులు సమస్యే లేదు. కానీ, ఏ కారణం చేతనైనా విద్యుత్ సేవలు అందకుంటే మాత్రం తప్పు కాంగ్రెస్ పైనే పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్‌కు కరెంట్ కష్టాలు తప్పవని అంటున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ఎప్పుడూ కరెంట్‌పై ఓ కన్నేసి ఉంచక తప్పని పరిస్థితి అని చెబుతున్నారు. శ్వేత పత్రం విడుదల చేస్తామనీ చెప్పారు.