Congress CLP Meeting : ఈ రోజు రాత్రే సీఎల్పీ సమావేశం..రేపే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో అధికార ఏర్పాటు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నేటి రాత్రి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఉదయం నుంచి తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఫలితాలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని స్పష్టం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 63 స్థానాలు గెలుచుకుంది. మరో స్థానంలో ముందంజలో ఉంది. అధికారిక బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం అయ్యింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్
ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకోగా.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోనుందని స్పష్టమైంది. ఆ పార్టీ నేత, సీఎం కేసీఆర్ కూడా ఓటమిని అంగీకరించారు. ఇప్పటికే ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అపజయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
కాగా.. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ పార్టీ అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నేటి రాత్రే సీఎల్పీ సమావేశం జరిపించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన ఎమ్మెల్యేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇప్పటికే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం ఏఐసీసీ అబ్జర్వర్లు ఆధ్వర్యంలో సాగనుంది. వారి సమక్షంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ ఇతర నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.