Revanth Reddy: హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. కాబోయే సీఎంకు ఘనస్వాగతం
సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. మంగళవారం రాత్రి అదిష్టానం పిలుపు అందుకుని ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రికి ఎల్లా హోటల్‌లో బస చేసి గురువారం ఉదయం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్లనున్నారు.
CM Revanth Reddy: సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు. బుధవారం రాత్రి ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి వెంటే షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి సహా పలువురు ఉన్నారు.
రేవంత్ రెడ్డి అదిష్టానం పిలుపుతో మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలను కలిశారు. క్యాబినెట్ మంత్రుల ఎంపికపై అదిష్టానం, రేవంత రెడ్డి చర్చించారు. ఇదే ట్రిప్‌లో రేవంత్ రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసినట్టూ తెలిసింది. ఆయన తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్‌కు అందించినట్టు సమాచారం.
Also Read : Vote Share: కమ్యూనిస్టులు బీజేపీని ఎదుర్కోగలరా? మూడు అసెంబ్లీ ఎన్నికలు మనకు చెప్పే పాఠం ఏమిటీ?
మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య బేగంగపేట్ విమానాశ్రయానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి ఆ తర్వాత గచ్చిబౌలికి బయల్దేరి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి ఆయన ఎల్లా హాస్పిటల్‌లో బస చేయనున్నారు. గురువారం ఉదయం ఆయన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రజలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.