తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును బుధవారం ఆయన స్వగ్రామం చింతమడకకు చెందిన గ్రామస్తులు కలిశారు. బుధవారం దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వచ్చారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును బుధవారం ఆయన స్వగ్రామం చింతమడకకు చెందిన గ్రామస్తులు కలిశారు. బుధవారం దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వచ్చారు. అయితే భద్రతా కారణాల రీత్యా పోలీసులు వారిని చెక్‌పోస్ట్ వద్దే ఆపేశారు. లోపలి నుంచి అనుమతి వస్తేనే పంపుతామని చెప్పడంతో దాదాపు 2 గంటల పాటు వేచే వున్నారు. అనంతరం లోపలి నుంచి ఆదేశాలు అందడంతో వారిని అనుమతించారు. తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్ ప్రజలకు అభివాదం చేసి పలకరించారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఆయనను చూడగానే కేసీఆర్ జిందాబాద్.. సీఎం , సీఎం అంటూ నినాదాలు చేశారు. కొంతమంది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. కాన్వాయ్‌ని హైదరాబాద్‌లోనే వదిలేసి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సొంత వాహనాల్లోనే కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. మరుసటి రోజు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సహకరిద్దామని, ఏం జరుగుతుందో చూద్దామని ఎమ్మెల్యేలతో అన్నారు. త్వరలోనే కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందామని వారికి చెప్పి పంపించారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కేసీఆర్ ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. ఎర్రవల్లి నుంచే అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తిరిగి యాక్టీవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Scroll to load tweet…