కాంగ్రెస్ సదన్ పేరును ‘ఆర్ఎస్ఎస్ అన్నా’గా మార్చండి - కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ పై మండిపడ్డ ఓవైసీ
Asaduddin Owaisi : కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఓ నేత తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన ‘మైనారిటీ డిక్లరేషన్’పై కూడా విమర్శలు చేశారు.
Asaduddin Owaisi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ‘మైనారిటీ డిక్లరేషన్’ పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కాంగ్రెస్ సదన్ పేరును 'ఆర్ఎస్ఎస్ అన్నా'గా మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అసదుద్దీన్ ‘‘ఈ కాంగ్రెస్ సదన్ కు నేటి నుంచి కొత్త పేరు పెట్టాలి.. అదేంటంటే ‘ఆర్ఎస్ఎస్ అన్నా’. హైదరాబాద్ లో కొత్త నగరాన్ని నిర్మిస్తామని, హైదరాబాద్ డిక్లరేషన్ చేస్తామని ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి మన ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ‘మైనారిటీ డిక్లరేషన్’ ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మైనారిటీల ఆర్థిక అభ్యున్నతి, సాధికారత కోసం తమ పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లో కుల గణన చేపడతామని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ ను రూ.4 వేల కోట్లకు పెంచుతామని, ముస్లింలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఇస్తామని హామీ ఇచ్చింది.
నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ‘అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్’ పథకం కింద ముస్లిం, క్రిస్టియన్, సిక్కు యువతకు ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన తర్వాత ఏడాదికి రూ.5 లక్షల కార్పస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే మైనారిటీలకు విద్య, ఉపాధి సమానత్వానికి నిబద్ధత, మతపరమైన హక్కులు, సంస్కృతి పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, సమ్మిళితత్వం, వృద్ధిని ప్రోత్సహించేందుకు పలు ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రతిపాదించింది.
ఇదిలా ఉండగా.. ఈ నెల (నవంబర్) 30వ తేదీన తెలంగాణలో ఎన్నికల జరగున్నాయి. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మూడు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.