KTR: గల్ఫ్ పాలసీ ప్రకటించిన బీఆర్ఎస్.. వలస కార్మికులకు రూ. 5 లక్షల బీమా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గల్ఫ్ పాలసీ ప్రకటించారు. రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకూ బీమా ఉంటుందని వివరించారు. గల్ఫ్ పాలసీ కింద రూ. 5 లక్షల బీమాను అమలు చేస్తామని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గల్ఫ్ పాలసీని ప్రకటించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు రూ. 5 లక్షల బీమా కవరేజ్ తీసుకువస్తామని చెప్పారు. ఈ కొత్త పాలసీని జనవరిలో ప్రకటించనున్నారు. ఈ పథకం రైతు బీమా పథకాన్ని పోలి ఉంటుంది. రైతు బీమా కింద పట్టాదారు చనిపోతే వెంటనే రూ. 5 లక్షలు అందుతున్నట్టే గల్ఫ్ పాలసీలోనూ ఆ దేశాలకు వెళ్లిన కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలుస్తున్నది.
బీమా పాలసీతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా గల్ఫ్ పాలసీ కింద చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో ఈ ప్రకటన చేశారు.
Also Read: Kambala: జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
తెలంగాణ నుంచి ఇప్పటికీ చాలా మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు గణనీయమైన సంఖ్యలో వెళ్లుతారు. తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎక్కువగానే ఉంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ గల్ఫ్ పాలసీని ప్రకటించడం గమనార్హం.
కాగా, ఈ రోజు మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు రాజకీయ నిరుద్యోగులని, వారి మాటలు విని యువత మోసపోవద్దని అన్నారు. వీరిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఉద్యోగాలు చేశారా? కనీసం దరఖాస్తు చేశారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్సోళ్లు ఇప్పుడు మాట తప్పలేదా? అని నిలదీశారు. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రమే లేదని వివరించారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4వ తేదీన తానే స్వయంగా అధికారులతో కలిసి అశోక్ నగర్‌కు వస్తానని చెప్పారు. అక్కడే జాబ్ క్యాలెండర్ రూపొందిస్తా మని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యువతకు హామీ ఇచ్చారు.