Boath assembly election result 2023 : బోథ్‌లో అనిల్ జాదవ్ ఘన విజయం.. 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై 23 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
Anil Jadhav : తెలంగాణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపట్టబోతోందని స్పష్టం అవుతోంది. ఎన్నికల ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. అధికార బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కాబోతోంది. ఈ సారి ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలో కూర్చోబోతోంది.
అధికార బీఆర్ఎస్ పార్టీ అనేక స్థానాల్లో ఓడిపోగా.. కొన్ని స్థానాలను మాత్రం స్థిరపర్చుకుంది. భారీ మెజారిటీతో గెలుపుపొందింది. అందులో ఒకటి బోథ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ ఘన విజయం సాధించారు. ఆయన 23,518 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును ఆయన ఓడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్
అనిల్ జాదవ్ కు మొత్తంగా 76,297 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప అభ్యర్థి సోయం బాపురావుకు 53,274 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేదంర్ 32,424 ఓట్లతో సరి పెట్టుకున్నారు. అనిల్ జాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ తరుఫున టిక్కెట్ ఆశించి భంగపడ్డారు.
దీంతో ఆయన ఇండిపెండింట్ గా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన అనిల్ జాదవ్ 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు చేతిలో ఓడిపోయారు. అనంతరం 2019లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. తరువాత వచ్చిన జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన నేరడిగొండ జడ్పీటీసీగా కొనసాగుతున్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టిక్కెట్ నిరాకరించింది. ఎస్టీ రిజర్వ్డ్ అయిన బోథ్ టిక్కెట్ ను అనిల్ జాదవ్ కు కేటాయించింది. ఈ ఊహించని పరిణామంతో రాథోడ్ బాపురావు అలకబూని బీజేపీలో చేరిపోయారు. అయినా అనిల్ జాదవ్ వెనకంజ వేయకుండా నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటించారు. అనతి కాలంలోనే నియోజకవర్గ ప్రజల మనసును గెలుచుకొని భారీ మెజారిటీ సాధించారు.