కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతాం: నారాయణపేట సభలో జేపీ నడ్డా
తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచింది. బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల చివరలో మూడు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు.
నారాయణపేట:కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) చెప్పారు.నారాయణపేటలో ఆదివారంనాడు జరిగిన భారతీయ జనతా పార్టీ సకల జనుల సంకల్ప సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదని జేపీ నడ్డా చెప్పారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబానికే లబ్ది జరిగిందని ఆయన ఆరోపించారు.నవంబర్ 30న కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ ఎన్నికల్లో కుటుంబ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు.వచ్చే ఈ నెల 30న జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని జేపీ నడ్డా చెప్పారు.ఈ ఎన్నికలు తెలంగాణ స్వరూపాన్ని మార్చనున్నాయని జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు.ధరణి పోర్టల్ ద్వారా వేలాది ఎకరాల భూములను దోచుకున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందన్నారు.
తెలంగాణలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉందని జేపీ నడ్డా చెప్పారు.బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని ఆయన విమర్శించారు.తెలంగాణ అభివృద్ది కోసం మోడీ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని జేపీ నడ్డా ఆరోపించారు.కేసీఆర్ అవినీతి వల్ల కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగమౌతున్నాయని ఆయన విమర్శించారు.
also read:తెలంగాణ అభివృద్దిపై స్పష్టమైన విజన్: ఖానాపూర్ సభలో ప్రియాంక గాంధీ
మియాపూర్ భూముల్లో రూ. 4 వేల కోట్ల కుంభకోణం జరిగిందని జేపీ నడ్డా ఆరోపించారు.దళితబంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. 30 శాతం కమీషన్ తీసుకొనే ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు.తెలంగాణ ప్రగతి కోసం కేంద్ర నిధులు వినియోగించడం లేదని ఆయన విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ పై వ్యాట్ ను రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని ఆయన ఇచ్చిన హామీని ఆయన ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్, బీహార్, యూపీ, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టలు అధికారంలో ఉన్నాయన్నారు.